ఐసిస్‌లో చేరేందుకు యత్నం: పోలీసులకు పట్టుబడ్డ ఐఐటీ విద్యార్థి

ఉగ్రవాద సంస్థ అయిన ఇస్లామిక్ స్టేట్(ఐసిస్)లో చేరేందుకు వెళ్తున్న ఐఐటీ-గువహటి విద్యార్థిని అసోం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలోని కమ్రూప్ జిల్లాలోని హజో పట్టణంలో అతడిని అరెస్ట్ చేశారు.

Update: 2024-03-24 04:56 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రవాద సంస్థ అయిన ఇస్లామిక్ స్టేట్(ఐసిస్)లో చేరేందుకు వెళ్తున్న ఐఐటీ-గువహటి విద్యార్థిని అసోం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలోని కమ్రూప్ జిల్లాలోని హజో పట్టణంలో అతడిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీసీ జీపీ సింగ్ ఎక్స్ వేదికగా వివరాలు వెల్లడించారు. ఐఐటీ గువహటికి చెందిన విద్యార్థి ఉగ్ర సంస్థలో చేరేందుకు వెళ్తుండగా పట్టుకున్నట్టు తెలిపారు. తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, బంగ్లాదేశ్‌లోని ధుబ్రీ జిల్లాలో ఐఎస్ఐఎస్ ఇండియా హెడ్ హరీస్ ఫరూఖీ అలియాస్ హరీష్ అజ్మల్ ఫరూఖీ, అతని సహచరుడు అనురాగ్ సింగ్ అలియాస్ రెహాన్‌లను అరెస్టు చేసిన క్రమంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం కలకలం రేపింది.

ఢిల్లీలోని ఓఖ్లాకు చెందిన విద్యార్థి ఐఐటీ గువహటిలో నాలుగో సంవత్సరం చదువుతున్నారు. ఈ క్రమంలోనే ఐసిస్‌కు ఆకర్షితులయ్యాడు. దీంతో తాను ఐసిస్‌లో చేరేందుకు వెళ్తున్నట్టు ఆ విద్యార్థి ఈ మెయిల్ చేశాడు. దీనిని గుర్తించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థి ఆచూకీ తెలుసుకునేందుకు ఐఐటీ గువహటి అధికారులను సంప్రదించారు. విద్యార్థి కనిపించడపోవడంతో పాటు అతని మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ అయినట్టు వారు తెలిపారు. ఈ నేపథ్యంలోనే గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు శనివారం రాత్రి హజో పట్టణంలో సమీపంలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థి హాస్టల్ గదిలోనూ నల్ల జెండాలను గుర్తించినట్టు అదనపు సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ కళ్యాణ్ కుమార్ పాఠక్ తెలిపారు. పలు వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత దర్యాప్తు చేపడతామని పాఠక్ వెల్లడించారు. 

Tags:    

Similar News