గాజా ఆస్పత్రి దాడిపై స్పందించిన ప్రధాని మోడీ..
"Those Involved Should Be Held Responsible": PM Modi On Gaza Hospital Tragedy
న్యూఢిల్లీ : గాజాలోని అల్ అహ్లీ హాస్పిటల్‌పై మంగళవారం జరిగిన వైమానిక దాడిని ప్రధాని నరేంద్ర మోడీ ఖండించారు. 500 మందిని బలిగొన్న ఈ విషాదకర ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తూ బుధవారం మోడీ ట్వీట్ చేశారు. ఈ యుద్ధంలో పౌర మరణాలపై ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులకు శిక్షపడాలని డిమాండ్ చేశారు. ‘గాజాలోని అల్ అహ్లీ హాస్పిటల్‌పై జరిగిన దాడిలో ప్రాణనష్టం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి చెందాను. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
ఈ ఘర్షణలో పౌర మరణాలు ఆందోళన కలిగించే విషయం. ఇందులో ప్రమేయం ఉన్నవారికి శిక్షపడాలి’ అని ప్రధాని పోస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌కు సంఘీభావం తెలిపేందుకు ఆ దేశ పర్యటనకు వెళ్లిన సందర్భంలోనే ప్రధాని పోస్ట్ వెలువడింది. ఇక అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడిని ఉగ్రవాద దాడిగా అభివర్ణించిన మొదటి ప్రపంచ నాయకుల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఒకరు. ఆ దేశానికి సంఘీభావం తెలపడమే కాకుండా క్లిష్ట సమయంలో భారత్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.