వారే... రాజకీయాలకు నిజమైన వారసులు! ప్రధాని మోదీ

వికసిత్ భారత్ లక్ష్యం దిశగా... దేశ పునాదులను పటిష్టం చేసే ఎన్నో విషయాలు 21 వ శతాబ్దంలో జరుగుతున్నాయని నరేంద్ర మోదీ తెలిపారు.

Update: 2024-08-25 07:56 GMT

దిశ, వెబ్ డెస్క్:  వికసిత్ భారత్ లక్ష్యం దిశగా... దేశ పునాదులను పటిష్టం చేసే ఎన్నో విషయాలు 21 వ శతాబ్దంలో జరుగుతున్నాయని నరేంద్ర మోదీ తెలిపారు. "అసలు ఎలాంటి నేపథ్యం లేని లక్ష మంది యువత రాజకీయాల్లోకి రావాలని స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన లభించిందని అన్నారు. అభివృద్ధి చెందిన భారత్, బలమైన ప్రజాస్వామ్యం కోసం యువత తప్పకుండా ప్రజా జీవితంలోకి రావాలి" అని పునరుద్ఘాటించారు. అయితే ఆదివారం ప్రసారమైన 113 వ మన్ కీ బాత్ ఎపిసోడ్ లో పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు స్వాతంత్య్ర ఉద్యమంలో రాజకీయ నేపథ్యం లేకపోయినప్పటికీ.. అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారని, దేశం కోసం వారు తమను తాము పూర్తిగా అంకితం చేసుకున్నారని ఈ సందర్భంలో గుర్తు చేశారు.

అయితే.. నేడు వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి మనం మరొక్కసారి అదే స్ఫూర్తిని కలిగించాల్సిన అవసరం ఉందని, పెద్ద ఎత్తున యువత రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. కానీ వారికి సరైన మార్గదర్శకత్వం, సరైన అవకాశాలు కూడా కావలసి ఉందని తెలిపారు. ప్రతిభ కలిగిన యువత రాజకీయాల్లోకి రావాలంటే కుటుంబ రాజకీయాలు ఉండకూడదని, ఈ కుటుంబ రాజకీయాలే వాటిని అణచివేస్తాయని అన్నారు.

ఈ సందర్భంగా మోదీ.. "అంతరిక్ష రంగంలో కృషి చేస్తున్న ఔత్సాహిక, యువ పారిశ్రామిక వేత్తలతో ముచ్చటించారు. ప్రస్తుతం అంతరిక్ష రంగంలో భారత్ దూసుకెళ్తోందని, చంద్రయాన్-3 విజయానికి గుర్తుగా స్పేస్ డే నిర్వహించినట్లు తెలిపారు.అయితే ఈ ఏడాదే మనం తొలి అంతరిక్ష దినోత్సవాన్ని కూడా జరుపుకున్నట్లు ఆయన వెల్లడించారు. అంతరిక్ష రంగంలో తీసుకొచ్చిన అనేక సంస్కరణల వల్ల పెద్ద ఎత్తున యువత లబ్ది పొందినట్లు తెలిపారు. చంద్రుడి దక్షిణ ధృవం పై దిగిన తొలి దేశంగా భారత్ అవతరించిందని, ఈ ప్రయోగంతో యువత అంతరిక్ష రంగంలోకి రావడానికి చాలా ఆసక్తిని కనబరుస్తున్నారు" అని మోదీ మన్ కీ బాత్ లో ముచ్చటించారు. 


Similar News