Bhupinder huda: హర్యానాలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు.. కాంగ్రెస్ నేత భూపిందర్ హుడా

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సొంతంగా గెలిచే సత్తా ఉందని ఆ రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత భూపేందర్ హుడా అన్నారు.

Update: 2024-08-14 11:58 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సొంతంగా గెలిచే సత్తా ఉందని ఆ రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత భూపిందర్ హుడా అన్నారు. ఏ పార్టీతోనూ పొత్తు ఉండకపోవచ్చని తెలిపారు. టికెట్లు సరైన నాయకులకు ఇవ్వడమే గెలుపునకు ప్రామాణికమని చెప్పారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్‌)తో పెట్టుకునే అవకాశం ఉందా అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. జాతీయస్థాయిలో ఆపుతో పొత్తు ఉందని, కానీ రాష్ట్రస్థాయిలో ఇప్పటివరకు ఏ పార్టీతోనూ చర్చలు జరుపలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి సొంతంగా గెలిచే సామర్థ్యం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరగలేదని తెలిపారు.

అగ్ని పథ్ స్కీమ్, పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) వంటి అంశాలు అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అగ్నిపథ్ స్కీమును రద్దు చేస్తామని తెలిపారు. అగ్నివీరులు నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చి ఏం చేయాలని ప్రశ్నించారు. ప్రతి ఏటా సాయుద దళాలకు 5000 మంది ఎంపికయ్యే వారని కానీ ఈ ఏడాది కేవలం 250 మంది మాత్రమే రిక్రూటయ్యారని చెప్పారు. దేశ సైన్యంలోని ప్రతి 10 మంది జవాన్లలో ఒకరు హర్యానాకు చెందిన వారేనని తెలిపారు. అగ్ని వీర్ పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

రాయ్ పూర్ లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో ఎంఎస్పీకి చట్టపరమైన హామీ ఇచ్చామని తెలిపారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని కానీ ఆ విషయం వారు మర్చిపోయారని ఆరోపించారు. ఎరువులు, పురుగు మందుల ధరలు విపరీతంగా పెంచారన్నారు. హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వృద్ధాప్య పెన్షన్‌ను రూ.6000కు పెంచుతామని, పాత పెన్షన్ విధానాన్ని వెనక్కి తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. అలాగే రూ.300కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని స్పష్టం చేశారు. 2లక్షల ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. కాగా, ఈ ఏడాది చివరలో హర్యానాలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News