సీజేఐను దేవుడితో పోల్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
న్యాయాన్ని అందించడం దేవుడి పని. న్యాయమూర్తి తీర్పులు వెలువరించినప్పుడు, అది దేవుడి పనిగా పరిగణించబడుతుందని
దిశ, నేషనల్ బ్యూరో: చండీగఢ్ మేయర్ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయంపై బుధవారం భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసించారు. బుధవారం డిల్లీ శాసనసభలో మాట్లాడిన కేజ్రీవాల్ భగవద్గీతను ప్రస్తావిస్తూ, బీజేపీ అధర్మాన్ని అంతం చేయాలని దేవుడు నిర్ణయించుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా.. 'మేము కోర్టులను దేవాలయాలుగా భావిస్తాం. న్యాయాన్ని అందించడం దేవుడి పని. అందుకే న్యాయమూర్తి తీర్పులు వెలువరించినప్పుడు, అది ఓ విధంగా దేవుడి పనిగా పరిగణించబడుతుందని' కేజ్రీవాల్ అన్నారు. సీజేఐ చంద్రచూడ్‌ను దేవుడితో పోల్చిన కేజ్రీవాల్, 'మంగళవారం సుప్రీంకోర్టులో జరిగింది గమనించిన తర్వాత, న్యాయస్థానంలో శ్రీకృష్ణుడు కూడా ఉన్నట్టు అనిపించింది. చీఫ్ జస్టిస్‌లో దేవుడు ఉన్నాడని' అన్నారు. క్లిష్ట పరిస్థితుల మధ్య ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల ఫలితాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం చండీగఢ్ మేయర్ ఎన్నిక చెల్లదని, రిటర్నింగ్ అధికారి చట్టవిరుద్ధంగా ప్రవర్తించారని పేర్కొంది. ఆప్ కౌన్సిలర్ కుల్దీప్‌కుమార్‌ను మేయర్‌గా ప్రకటించింది. ఇదే సమయంలో బీజేపీపై కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. ఆ పార్టీ ఎప్పుడూ విజయం సాధించదని, బదులుగా అడ్డమైన మార్గాల్లో అధికారాన్ని దొంగలిస్తుందని వ్యాఖ్యానించారు. వారి వద్ద మెషీన్లు ఉన్నాయి కాబట్టి లోక్‌సభలో 370 సీట్లు గెలుస్తామని కాషాయ పార్టీ ప్రగల్భాలు పలుకుతోందన్నారు. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను సీజ్ చేసిందని, ఆప్ విషయంలోనూ అదే పని చేస్తుందని ఆరోపించారు.