నెహ్రూ చైనాకు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే సరిహద్దు సమస్యలు: కేంద్ర మంత్రి జైశంకర్

పటేల్‌తో చర్చల సందర్భంగా నెహ్రూ భారత్‌ను కాదని చైనాకు సభ్యత్వం కల్పించడానికి ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు.

Update: 2024-04-03 13:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రు చేసిన తప్పిదాల కారణంగానే ఈరోజు పాకిస్థాన్ అక్రమిత కశ్మీర్, చైనా రూపంలో భారత్‌కు సమస్యలు ఎదురవుతున్నాయని విదేశాంగ మంత్రి జై శంకర్ అన్నారు. బుధవారం అహ్మదాబాద్‌లోని గుజరాత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం అప్పటి డిప్యూటీ సర్దార్ వల్లభాయ్ పటేల్‌తో చర్చల సందర్భంగా నెహ్రూ భారత్‌ను కాదని చైనాకు సభ్యత్వం కల్పించడానికి ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. చైనా నుంచి ముప్పు ఉందని పటేల్ నెహ్రూను హెచ్చరించారు. 1950లో సర్దార్ పటే, నెహ్రూ మధ్య జరిగిన చర్చలో పటేల్ నెహ్రూను హెచ్చరించారు. పటేల్ ఆనాడు ఊహించిన విధంగానే ఈ రోజు మన పాకిస్తాన్, చైనాలతో సరిహద్దు సమస్యలను ఎదుర్కొంటున్నాం. అప్పట్లో చైనా ఏది మాట్లాడినా, వారి ఉద్దేశ్యం మంచిది కాదని పటేల్ భావించేవారు. 'ముందు జాగ్రత్తలు తీసుకుని, దీనిపై విధానాలను రూపొందించాలని' పటేల్ సూచించారు. కానీ నెహ్రూ పూర్తిగా అందుకు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారని జైశంకర్ వివరించారు. అందుకు బదులుగా 'మీరు చైనీయులను అనవసరంగా అవమానిస్తున్నారు. హిమాలయాల మీది నుంచి ఎవరైనా దాడి చేయడం అసాధ్యమ'న్నారు. ఆ తర్వాత కొన్నేళ్లకు యూఎన్ గురించి చర్చ సందర్భంగా.. మనకు శాశ్వత సభ్యత్వం కావాలి. అయితే ముందుగా చైనాకు స్థానం కల్పించాలని నెహ్రూ అన్నారు. పైగా కశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితి వద్దకు తీసుకెళ్లొద్దని పటేల్‌తో నెహ్రూ అన్నారు. దానివల్ల గత దశాబ్ద కాలంగా కేంద్రం అనేక సమస్యలతో పోరాడుతోంది. 

Tags:    

Similar News