న్యూఢిల్లీ : మహిళా ఉద్యోగులకు జీతంతో కూడిన నెలసరి సెలవులను ఇవ్వలేమని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. ప్రతి మహిళ జీవితంలో నెలసరి అనేది శారీరక ధర్మమని.. అదేమీ వైకల్యం కాదని తేల్చి చెప్పారు. నెలసరిని కారణంగా చూపించి ప్రత్యేక సెలవులను పొందాలనుకోవడం సరికాదని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి సెలవుల కారణంగా కొంతమంది మహిళలపై వివక్ష చూపించినట్టు అవుతుందని చెప్పారు. ఈ అంశంపై రాజ్యసభలో ఎంపీ మనోజ్ కుమార్ ఝా లేవనెత్తిన ప్రశ్నకు
మంత్రి స్మృతి ఇరానీ ఈమేరకు బదులిచ్చారు. నెలసరి పరిశుభ్రతపై త్వరలోనే దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా ఓ పాలసీని తీసుకొస్తామన్నారు. ఇప్పటికే ప్రమోషన్ ఆఫ్ మెన్‌స్ట్రువల్ హైజీన్ మేనేజ్‌మెంట్ (ఎంహెచ్ఎం) స్కీమ్ అమల్లో ఉందని ఆమె గుర్తు చేశారు. 10 నుంచి 19 ఏళ్లలోపు అమ్మాయిలకు నెలసరి పరిశుభ్రతపై అవగాహన కల్పించడమే ఈ పథకం లక్ష్యమన్నారు. కాగా, ప్రస్తుతానికి స్పెయిన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు ‘పెయిడ్ పీరియడ్ లీవ్స్’ అందుబాటులో ఉన్నాయి.