మళ్లీ చెలామణిలోకి 1000 నోటు?
ఆర్బీఐ మళ్లీ 1000 రూపాయల నోట్లను చెలామణిలోకి తీసుకొస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
దిశ, వెబ్ డెస్క్: రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు శుక్రవారం ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా 2 వేల రూపాయల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. అదేవిధంగా 10.8 శాతం 2 వేల నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో 2 వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నామని, సెప్టెంబర్ 30లోగా ఈ నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇక తాజాగా 2 వేల నోట్లను రద్దు చేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ కొత్త విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రూ.2 వేల నోటు స్థానంలో మళ్లీ 1000 నోటును తీసుకురానున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. 2 వేల నోటు ఎక్కువగా చెలామణిలో లేదని ఆర్బీఐ చెప్పడంలో అంతరార్థం అదేనని కొందరూ ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
2 వేల నోటు లాంటి పెద్ద నోట్లు ఉండటం వల్ల నోట్ల సర్క్యులేషన్ బాగా తగ్గిందని, దాన్ని అరికట్టడానికే కేంద్ర ప్రభుత్వం 2 వేల నోట్ల ఉపసంహరణకు పూనుకొందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే 1000 నోట్లను సరికొత్తగా ముద్రించి మళ్లీ చెలామణిలోకి తీసుకువస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 2 వేల నోట్ల ఉపసంహరణపైన ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. అది ఉపసంహరణ కాదని, ఖచ్చితంగా రద్దు అని వారు ఆరోపిస్తున్నారు. రద్దు అంటే ప్రజల ఆగ్రహావేశాలకు గురి కావొస్తుందని ఇలా ఉపసంహరణ అంటూ కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని విపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.2 వేల నోట్లను ఎందుకు రద్దు చేశారో చెప్పాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇక 2 వేల నోట్ల వల్ల మరింత బ్లాక్ మనీ పెరిగిపోతోందని, దాన్ని అరికట్టడానికే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని మరో వర్గం వాదిస్తోంది. కాగా 2016లో మోడీ ప్రభుత్వం డీమానిటైజేషన్ చేసింది. ఇందులో భాగంగా 1000, 500 నోట్లను రద్దు చేసింది. వాటి స్థానంలో కొత్తగా మళ్లీ 2000, 500, 200 నోట్లను తీసుకొచ్చింది.
Read more: