ప్రతిపక్షాల పిటిషన్‌ను విచారించలేం: సుప్రీంకోర్ట్

సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందంటూ 14 ప్రతిపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించడానికి నిరాకరించింది.

Update: 2023-04-05 10:44 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందంటూ 14 ప్రతిపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించడానికి నిరాకరించింది. నిర్దిష్టంగా ఒక కేసులోని పూర్వాపరాలను, మెరిట్స్ ను పరిగణనలోకి తీసుకోకుండా దర్యాప్తు సంస్థల ఫంక్షనింగ్‌కు సంబంధించి జనరల్ గైడ్‌లైన్స్ ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

విపక్ష నేతలపై దర్యాప్తు సంస్థలు కేసులు పెట్టి వేధిస్తున్నాయని, అరెస్టు చేయకుండా, రిమాండ్ విధించకుండా ఉండేలా సాధారణ మార్గదర్శకాలను జారీ చేయాలని ఆ పిటిషన్‌లో కాంగ్రెస్ సహా 14 పార్టీలు విజ్ఞప్తి చేశాయి. బెయిల్ విషయంలోనూ స్పష్టమైన గైడ్‌లైన్స్ ఇవ్వాలని కోరాయి. దీనిపై బుధవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం అలాంటి జనరల్ గైడ్‌లైన్స్ రూపొందించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.

కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష పార్టీల పైకి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఉసిగొల్పుతున్నదనే సాధారణ సూత్రీకరణతో పిటిషన్‌ను విచారించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. రాజకీయ నాయకుల కోసం దర్యాప్తు సంస్థలకు విడిగా గైడ్‌లైన్స్ రూపొందించడం సాధ్యం కాదని పిటిషన్ తరఫున హాజరైన న్యాయవాదికి స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ధర్మాసనం విజ్ఞప్తి మేరకు 14 ప్రతిపక్ష పార్టీల తరఫున దాఖలైన పిటిషన్‌ను న్యాయవాది ఉపసంహరించుకున్నారు.

Tags:    

Similar News