Swati Maliwal case: బిభవ్ కుమార్‌కు షాక్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు

ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడికి పాల్పడిన కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పీఏ బిభవ్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది

Update: 2024-08-02 11:48 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడికి పాల్పడిన కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పీఏ బిభవ్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కుమార్‌ పిటిషన్ వేయగా శుక్రవారం దానిని విచారించిన జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ పిటిషన్‌ను కొట్టివేశారు. విచారణ సందర్భంగా ఆయన్ను బెయిల్‌పై విడుదల చేయడం ద్వారా దర్యాప్తు ప్రభావితం అవుతుందని ఢిల్లీ పోలీసులు బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించారు. కుమార్‌‌ను అక్రమంగా అరెస్ట్ చేయలేదని చట్ట ప్రకారం నిబంధనల మేరకే అరెస్ట్ చేశామని వారు కోర్టులో చెప్పారు.

మే 13న కేజ్రీవాల్ అధికారిక నివాసంలో సీఎంను కలవడానికి వెళ్లిన తనపై కుమార్ దాడి చేశాడని, ఛాతీ, కడుపుపై కొట్టాడని స్వాతి మలివాల్‌ ఫిర్యాదు చేయగా, ఆయనపై మే 16న భారతీయ శిక్షాస్మృతి నిబంధనల ప్రకారం నేరపూరిత బెదిరింపులు, సాక్ష్యాలను నాశనం చేయడం, ఒక మహిళపై దాడి చేయడం లేదా నేరపూరిత బలవంతం చేయడం, హత్యకు ప్రయత్నించడం వంటి పలు సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న తరువాత పోలీసులు కుమార్‌‌ను మే 18న అరెస్ట్ చేశారు. అయితే దానికంటే ముందే కుమార్‌ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా దానిని కోర్టు తిరస్కరించింది. అప్పటి నుంచి బిభవ్‌ కుమార్‌ జైల్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తన అరెస్టు చట్ట విరుద్ధమని ప్రకటించాలని, అందుకు పరిహారం చెల్లించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, తాజాగా కోర్టు దానిని కొట్టివేయడం గమనార్హం. ఆయన బెయిల్ పిటిషన్‌ను గతంలో ట్రయల్ కోర్టు, హైకోర్టు తిరస్కరించగా, సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 7న సుప్రీంకోర్టు చేపట్టనుంది.

Tags:    

Similar News