కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను వాయిదా వేసిన కోర్టు

ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ విచారణను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 19 కి వాయిదా వేసింది

Update: 2024-06-14 06:49 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ విచారణను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 19 కి వాయిదా వేసింది. ఈ విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తమ స్పందనను దాఖలు చేసేందుకు మరింత సమయం కోరడంతో అదనపు సెషన్స్ జడ్జి ముఖేష్ కుమార్ విచారణను వాయిదా వేశారు. అలాగే, తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి పరీక్షలు చేస్తున్నప్పుడు ఆయన భార్యను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు పరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన దరఖాస్తును న్యాయమూర్తి శనివారానికి వాయిదా వేశారు.

ఇంకా కేజ్రీవాల్ చేసిన అభ్యర్థనపై స్పందించాలని న్యాయమూర్తి తీహార్ జైలు సూపరింటెండెంట్‌ను కోరారు. మెడికల్ బోర్డు ఇంకా అధికారికంగా ఏర్పాటు కాలేదని, ఈ పిటిషన్‌ను జూన్ 25కి వాయిదా వేయాలని ఈడీ కొరగా, కేజ్రీవాల్ తరపు న్యాయవాది మెడికల్ బోర్డు పనిచేస్తోందని, సంప్రదింపులు జరుపుతోందని స్పష్టం చేశారు. ఈడీ తరపున న్యాయవాది వాదనలపై జడ్జి మాట్లాడుతూ, నిందితుడు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు, మీ కస్టడీలో లేడు. అతనికి ఏదైనా వసతి కావాలంటే, ఆ విషయంలో మీకు అధికారం లేదు. మేము అతని సౌలభ్యాన్ని పరిశీలిస్తాం అని అన్నారు.

అంతకుముందు జూన్ 5న, వైద్య కారణాలతో మధ్యంతర బెయిల్ కోసం కేజ్రీవాల్ చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. అయినప్పటికీ, కేజ్రీవాల్ కస్టడీలో ఉన్నప్పుడే వైద్య అవసరాలు తీర్చాలని తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. ఇటీవల జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికలలో ప్రచారం చేయడానికి తాత్కాలికంగా మూడు వారాల బెయిల్‌ను మంజూరు చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత, మరుసటి రోజు తిరిగి జైలుకు వచ్చారు.


Similar News