దేశం మార్పు దిశగా పయనిస్తోంది: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రజలు అండగా నిలిచారని, దేశం ప్రస్తుతం మార్పు దిశగా పయనిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు.
దిశ, నేషనల్ బ్యూరో: రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రజలు అండగా నిలిచారని, దేశం ప్రస్తుతం మార్పు దిశగా పయనిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘మొదటి నాలుగు దశల ఎన్నికల్లోనే బీజేపీని ప్రజలు ఓడించారు. దేశం ద్వేషపూరిత రాజకీయాలతో విసిగిపోయింది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకునేందుకు ప్రజలు ఓటు వేస్తున్నారు’ అని పేర్కొన్నారు. ఉద్యోగాల కోసం యువత, ఎంఎస్పీ, రుణ మాఫీ కోసం రైతులు, ఆర్థిక స్వాతంత్ర్యం, భద్రత కోసం మహిళలు, న్యాయమైన వేతనాల కోసం కార్మికులు ఎంతగానో ఎదురు చూస్తున్నారని తెలిపారు. దేశ ప్రజలు ఇండియా కూటమికి మద్దతు తెలిపారని చెప్పారు. త్వరలోనే దేశంలో మార్పు రాబోతుందని స్పష్టం చేశారు. కాగా, ఐదో దశలో భాగం ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. దీనిలో రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయ్ బరేలీ నియోజకవర్గం కూడా ఉంది.