ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. రిషికేశ్-బద్రీనాథ్ హైవేపై లోయలో పడ్డ వాహనం
ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో రిషికేశ్-బద్రీనాథ్ హైవే దారిలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో రిషికేశ్-బద్రీనాథ్ హైవే దారిలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. 26 మంది ప్రయాణికులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ వాహనం అదుపుతప్పి అలకనంద నదిలో పడిపోవడంతో ఎనిమిది మంది మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. ఘటన జరిగిన ప్రాంతం రుద్రప్రయాగ్ నగరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందని తెలుస్తుంది. ప్రమాద సమాచారాన్ని అందుకున్న వెంటనే రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, జిల్లా విపత్తు నిర్వహణ, పోలీసు బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గుప్తకాశీ నుంచి హెలికాప్టర్ రుద్రప్రయాగ్ చేరుకుంది. గాయపడిన నలుగురిని హెలికాప్టర్‌లో ఎయిమ్స్‌కు తరలించినట్లు సమాచారం. మరికొంతమంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప వైద్యశాలకు తరలించారు, గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలి, గాయపడిన వారికి అన్ని విధాలా చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాం, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని బాబా కేదార్‌ని ప్రార్థిస్తున్నాను. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేయాలని జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశించినట్లు తెలిపారు.