'భారత వ్యతిరేక ప్రచారం' చేసినందుకు తెహ్రీక్-ఎ-హురియత్‌పై కేంద్రం నిషేధం
ఉపా చట్టం కింద జమ్మూ కశ్మీర్‌కు చెందిన తెహ్రీక్-ఎ-హురియత్‌ని కేంద్రం నిషేధించింది. చట్టవిరుద్ధమైన సంస్థగా కేంద్రం ప్రకటన
న్యూఢిల్లీ: చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) కింద జమ్మూ కశ్మీర్‌కు చెందిన తెహ్రీక్-ఎ-హురియత్‌ని కేంద్రం నిషేధించింది. దీన్ని 'చట్టవిరుద్ధమైన సంస్థ'గా కేంద్రం ఆదివారం ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వెల్లడించారు. గతంలో ఈ సంస్థకు మరణించిన వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ నేతృత్వం వహించారు. హురియత్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని, కశ్మీర్‌ను భారత్ నుంచి వేరుచేసి ఇస్లాం పాలనను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తోందని అమిత్‌షా ఆరోపించారు. భారత్‌పై దుష్ప్రచారం చేయడమే కాకుండా ఉగ్రవాద కార్యకలాపాల కోసం తెహ్రీక్-ఏ-హురియత్ ఏర్పాటు జరిగిందని, ఈ కారణంగానే ఉపా చట్టం కింద జమ్మూ కశ్మీర్‌లో ఈ సంస్థను చట్టవిరుద్ధ సంస్థగా ప్రకటించినట్టు అమిత్‌షా వివరించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోడీ అనుసరించే జీరో టాలరెన్స్ పాలసీ కింద భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఏ వ్యక్తి లేదా సంస్థనైనా అడ్డుకుంటామని అమిత్‌షా స్పష్టం చేశారు. కాగా, 2004లో జమ్మూ కశ్మీర్ వేర్పాటువాద నాయకుదు సయ్యద్ అలీ షా గిలానీ తెహ్రీక్-ఏ-హురియత్‌ను ఏర్పాటు చేశారు. అతని తర్వాత సంస్థ ఛైర్మన్‌గా ముహమ్మద్ అష్రాఫ్ సెహ్రాయ్ పనిచేశారు.