చలో ఢిల్లీ : రైతులపైకి రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్.. 40 మందికి గాయాలు
దిశ, నేషనల్ బ్యూరో : రైతుల ‘చలో ఢిల్లీ’ మార్చ్ బుధవారం ఉద్రిక్తంగా మారింది.
దిశ, నేషనల్ బ్యూరో : రైతుల ‘చలో ఢిల్లీ’ మార్చ్ బుధవారం ఉద్రిక్తంగా మారింది. పంజాబ్ - హర్యానా మధ్యనున్న దత్తా సింఘ్‌వాలా-ఖనౌరీ బార్డర్ వద్ద గుమిగూడిన నిరసనకారులను చెదరగొట్టడానికి హర్యానా పోలీసులు రబ్బరు బుల్లెట్లు, భాష్పవాయు గోళాలు, వాటర్ క్యానన్స్‌ను ప్రయోగించారు. దీంతో దాదాపు 40 మంది రైతులు గాయపడ్డారు. అంతకుముందు మంగళవారం రోజు కూడా ఇదేవిధంగా పోలీసులు తీసుకున్న చర్యలో దాదాపు 60 రైతులు క్షతగాత్రులయ్యారు. అంటే రెండు రోజుల నిరసనల్లో దాదాపు 100 మందికిపైనే రైతులు గాయాలతో ఆస్పత్రుల్లో చేరారు. భాష్పవాయు గోళాల ఎఫెక్టుతో ఆయా రైతుల కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడే రైతులకు చికిత్స అందించేందుకు రైతు సంఘాలు సంచార ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ముఖాలకు తడి బట్టలు, గోనె సంచులు..
బుధవారం సాయంత్రం సమయానికి పంజాబ్ - హర్యానా బార్డర్‌లో దాదాపు 15వేల మంది రైతులు గుమిగూడారు. వారు ఢిల్లీ వైపుగా కదులుతుండటంతో చెదరగొట్టేందుకు పోలీసులు మరోసారి భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. టియర్‌గ్యాస్ షెల్స్ బారినపడకుండా రైతులు తమ ముఖాలను తడి బట్టలు, గోనె సంచులతో చుట్టుకున్నారు. కొందరు రైతులైతే టియర్‌గ్యాస్ పొగను వెనక్కి తిప్పికొట్టడానికి ఏకంగా వ్యవసాయ పరికరాలను తీసుకొచ్చారు. ఇంకొందరు రైతులు టియర్ గ్యాస్ షెల్స్‌ను గగనతలం నుంచి జారవిడిచే పోలీసుల డ్రోన్లను ఎదుర్కొనేందుకు గాలిపటాలు ఎగరేశారు. పంజాబ్ వైపు నుంచి రైతులు సరిహద్దు దాటడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు, రైతులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో కొంతమంది పోలీసులు కూడా గాయపడ్డారు.
డ్రోన్ల వాడకంపై పంజాబ్ వర్సెస్ హర్యానా పోలీసులు
జాతీయ రహదారులపై ఉండే భారీ స్వాగత బోర్డులు నిరసనకారులకు రక్షణ కవచంగా మారుతున్నాయి. టియర్ గ్యాస్ షెల్స్ ఆ బోర్డులపై పడి నిర్వీర్యం అవుతున్నాయి. దీంతో స్వాగత బోర్డులను పోలీసులు తొలగించారు. రైతుల నిరసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. హర్యానా నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే మార్గంలో పెద్ద ఎత్తున సిమెంట్ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. రైతులపైకి టియర్ గ్యాస్‌ను ప్రయోగించే డ్రోన్ల వినియోగం విషయంలో పంజాబ్, హర్యానా పోలీసుల మధ్య వాగ్వాదం నడుస్తోంది. హర్యానా పోలీసులు వాడుతున్న డ్రోన్లు తమ రాష్ట్రానికి చెందిన భూభాగంలోకి ప్రవేశించకుండా చూడాలని పంజాబ్ పోలీసులు నిర్దేశించారు. ఈమేరకు హర్యానాలోని అంబాలా డిప్యూటీ కమిషనర్‌కు పంజాబ్‌లోని పటియాలా డిప్యూటీ కమిషనర్ లేఖ రాశారు.
రేపు రైల్ రోకో
రైతుల ఆందోళ నేపథ్యంలో లారీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంజాబ్-హర్యానా రహదారిపై పెద్ద ఎత్తున ట్రాక్టర్లు నిలపడంతో సరుకు రవాణా చేసే ట్రక్ డ్రైవర్లు గత మూడు రోజులుగా తమ వాహనాలను రోడ్డు పక్కన నిలిపివేశారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పంజాబ్‌లో రైల్ రోకో నిర్వహిస్తామని ‘భారతీయ కిసాన్ యూనియన్ ఉగ్రహాన్’ రైతు సంఘం ప్రకటించింది.
చర్చలకు కేంద్రం రెడీ : మంత్రి అర్జున్ ముండా
రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి అర్జున్ ముండా తెలిపారు. చర్చలకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని రైతు సంఘాలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. రైతుల ఆందోళనల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగకూడదని చెప్పారు. ఈ విషయాన్ని రైతులు అర్థం చేసుకోవాలన్నారు.
మేం ఘర్షణ కోసం రాలేదు: రైతు సంఘాలు
ప్రధాని మోడీ పెద్ద మనసు చేసుకొని పంటలకు చెల్లించే కనీస మద్దతు ధరకు (ఎంఎస్‌పీ) చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘం నాయకుడు సర్వణ్ సింగ్ పంథేర్ కోరారు. కేంద్రంతో ఘర్షణ పడేందుకు తాము ఢిల్లీ బార్డర్‌కు రాలేదన్నారు. చర్చలకు ప్రభుత్వ నుంచి లభించిన ఆహ్వానంపై తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. మంగళవారం రోజు ఆందోళనలో భాగంగా గాయపడిన రైతులతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్‌లో మాట్లాడారని చెప్పారు.
16న గ్రామీణ భారత్ బంద్
‘చలో ఢిల్లీ’ కార్యక్రమంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని ఆరోపిస్తూ రైతు సంఘాలు ఈ నెల 16న(శుక్రవారం) గ్రామీణ భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. భారత్ బంద్‌లో భాగంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్ పాటిస్తామని తెలిపాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులపై రైతులు పెద్దఎత్తున నిరసన తెలుపుతారని వెల్లడించారు.పంజాబ్‌లో నిరసన సందర్భంగా రాష్ట్ర, జాతీయ రహదారులను నాలుగు గంటల పాటు మూసివేయనున్నారు.