మోడీని అవమానించేలా తమిళనాడు మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు
సాధారణ కుటుంబం నుంచి వచ్చి దేశం కోసం జీవితాన్నే అంకితం చేసిన ప్రధాని మోడీని అవమానించడం సహించలేం.
దిశ, నేషనల్ బ్యూరో: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అవమానించేలా తమిళనాడు మంత్రి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం(ఈసీ)కి ఫిర్యాదు చేస్తామని వెల్లడించింది. తమిళనాడు మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్ ఇటీవల ఓ ప్రచార సభలో మాట్లాడుతూ, అణగారిన వర్గం ప్రజల ఓట్ల కోసం ప్రధాని మోడీ సర్దార్ వల్లభాయ్ పటేల్, కామరాజర్ విగ్రహాలను నెలకొల్పారు. ఇటువంటి అసహ్యకరమైన వ్యూహాలను ప్రధాని మోడీ అనుసరిస్తున్నారని ' అన్నారు. దీనిపై బీజేపీ పార్టీ తీవ్రంగా స్పందించింది. అనితా రాధాకృష్ణన్ వ్యాఖ్యలను ఖండించింది. సాధారణ కుటుంబం నుంచి వచ్చి దేశం కోసం జీవితాన్నే అంకితం చేసిన ప్రధాని మోడీని అవమానించడం సహించలేం. ఇలాంటి వ్యాఖ్యలు డీఎంకే ఎంపీ కనిమొళి ఆధ్వర్యంలో చేయడం తగని పని అని బీజేపీ ఎక్స్‌లో ట్వీట్ చేసింది. అయితే, ఇది పెద్దగా ఆశ్చర్యం అనిపించడంలేదు. నిజానికి, ఇది డీఎంకే డీఎన్‌ఎలోనే ఉన్న నీచమైన, అసభ్యకరమైన రాజకీయ సంస్కృతి' అని పేర్కొంది. ఇటువంటి వ్యాఖ్యలను సహించబోమని, దీని గురించి అనితా రాధాకృష్ణన్‌పై చర్యలు తీసుకునేలా ఈసీకి ఫిర్యాదు చేస్తామని బీజేపీ వెల్లడించింది.