Tamilnadu: అందరికి సమాన అవకాశాలు, హక్కులు.. జెండా ఆవిష్కరణలో హీరో విజయ్
ప్రముఖ స్టార్ హీరో విజయ్ ‘తమిళగ వెట్రి కజగం’ అనే పేరుతో కొత్త పార్టీని పెట్టిన విషయం తెలిసిందే
దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ స్టార్ హీరో విజయ్ ‘తమిళగ వెట్రి కజగం’ అనే పేరుతో కొత్త పార్టీని పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఆ పార్టీ జెండాను ఆవిష్కరించారు. చెన్నైలో తన పార్టీ కార్యాలయంలో విజయ్ జెండాను ఎగురవేశారు. మెరూన్, పసుపు రెండు కలర్స్‌లో ఉన్న జెండాలో రెండు వైపులా ఏనుగులు, మధ్యలో వాగాయ్ పుష్పం ఉంది. తమిళంలో వాగాయ్ అంటే విజయానికి చిహ్నంగా భావిస్తారు. అలాగే, పార్టీకి సంబంధించిన అధికారిక పాటను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ, దేశ విముక్తి కోసం పోరాడి తమ ప్రాణాలను అర్పించిన యోధులను, తమిళ నేల నుండి మన ప్రజల హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడిన అసంఖ్యాక సైనికులను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని అన్నారు.
కులం, మతం, లింగం, ప్రాంతం పేరుతో జరుగుతున్న వివక్షను తొలగించి అందరికీ సమాన అవకాశాలు, హక్కులు కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ రోజు పార్టీ జెండాను ఆవిష్కరించడం చాలా గర్వంగా ఉంది. తమిళనాడు అభివృద్ధికి కృషి చేస్తాను. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా జెండా ఎగురుతుంది. మొదటి రాష్ట్ర సదస్సు కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. దానికి సన్నాహాలు జరుగుతున్నాయి, అతి త్వరలో ఆ వివరాలను ప్రకటిస్తానని విజయ్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో విజయ్ తల్లిదండ్రులతో పాటు 300 మందికి పైగా కార్యకర్తలు, అభిమాన సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో, విజయ్ తమిళగ వెట్రి కజగం పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికలలో ఆయన పోటీ చేయలేదు, అలాగే ఇతర పార్టీలకు కూడా మద్దతు ఇవ్వలేదు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని మాత్రం చెప్పారు. విజయ్ ఎంట్రీతో తమిళరాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.