స్వలింగ దంపతుల సామాజిక ప్రయోజనాలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

స్వలింగ దంపతులకు కనీస సామాజిక హక్కులను ఏ విధంగా కల్పించవచ్చనే దానిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని సుప్రీం కోర్టు గురువారం సూచించింది.

Update: 2023-04-27 14:48 GMT

న్యూఢిల్లీ: స్వలింగ దంపతులకు కనీస సామాజిక హక్కులను ఏ విధంగా కల్పించవచ్చనే దానిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని సుప్రీం కోర్టు గురువారం సూచించింది. వాళ్ళు జాయింట్ బ్యాంక్ అకౌంట్స్ ఎలా తెరవాలి.. ఇన్సూరెన్స్ పాలసీలో నామినీగా స్వలింగ జంటలో ఎవరు ఉండాలి వంటి అంశాలపై ఒక స్పష్టతకు వస్తే బాగుంటుందని పేర్కొంది.

పెళ్లి చేసుకునే హక్కును తమకు కల్పించకపోవడం అనేది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందంటూ కొందరు స్వలింగ జంటలు వేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీ.వై చంద్ర చూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ విచారణ చేస్తూ ఈమేరకు వ్యాఖ్యలు చేసింది.

"ఇది చట్ట సభల యుగం.. ఇటువంటి కీలక  తరుణంలో స్వలింగ జంటల వంటి క్లిష్టమైన మానవ సంబంధాల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలని భావిస్తోంది? వారి సామాజిక భద్రత, సామాజిక సంక్షేమం కోసం ఏం చేయాలని అనుకుంటున్నది ? సమాజంలో స్వలింగ జంటలు ఏకాకులు గా మిగలకుండా.. వివక్షను ఎదుర్కోకుండా ఏం చేస్తారు? " అని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ను చీఫ్ జస్టిస్ డీ.వై. చంద్ర చూడ్ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నలకు సమాధానాలతో వచ్చే బుధవారం కోర్టుకు రావాలని ఆదేశించారు. ఇక ఇదే అంశంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు బుధవారం మాట్లాడుతూ.. "స్వలింగ వివాహాలకు చట్టబద్ధత అంశం అనేది పార్లమెంటు పరిధిలోని అంశం. ఇది కోర్టు పరిధిలోనిది కాదు. దీన్ని కోర్టు, కేంద్ర ప్రభుత్వం మధ్య నలిగే అంశంగా మార్చాలని నేను భావించడం లేదు" అని కామెంట్ చేశారు. 

Tags:    

Similar News