Supreme Court : వికలాంగులు, ట్రాన్స్ జెండర్లకు వేర్వేరు టాయిలెట్స్ ఉండాలి.. సుప్రీంకోర్టు ఆదేశాలు
అన్ని కోర్టు ప్రాంగణాల్లో వికలాంగులు, ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు నిర్మించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టు ప్రాంగణాలు, ట్రిబ్యునల్‌లలో పురుషులు, మహిళలు, వికలాంగులు, ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు నిర్మించాలని రాష్ట్రాల హైకోర్టులకు సుప్రీంకోర్టు (supreme court) ఆదేశాలు జారీ చేసింది. అన్ని కోర్టుల్లో పబ్లిక్ టాయిలెట్లు, ప్రజా సౌకర్యాలను నిర్మించేలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దిశానిర్దేశం చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ జేబీ పార్దివాలా, ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పబ్లిక్ టాయిలెట్ల లభ్యత ముఖ్యమైన విధి అని పేర్కొంది. ఇలాంటి సౌకర్యాలు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం పారిశుద్ధ్యానికి ప్రాప్యత ప్రాథమిక హక్కుగా గుర్తించారు. ఈ హక్కు స్వాభావికంగా వ్యక్తులందరికీ సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని నిర్ధారిస్తుంది. రాజ్యాంగంలోని పార్ట్ IV కింద ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడానికి నిరంతరం కృషి చేయాలి’ అని వ్యాఖ్యానించింది. కోర్టు ఆవరణలో టాయిలెట్ సౌకర్యాల నిర్మాణం, శుభ్రపరచడం కోసం ప్రభుత్వాలు తగిన నిధులను కేటాయించాలని పేర్కొంది. దీనిపై హైకోర్టు ఏర్పాటు చేసిన కమిటీతో చర్చించి ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని స్పష్టం చేసింది. నాలుగు నెలల వ్యవధిలో అన్ని హైకోర్టులు, రాష్ట్రాలు, యూటీలు స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని ఆర్డర్స్ జారీ చేసింది.