కేజ్రీవాల్ కు బిగ్ షాక్.. బెయిల్ పొడిగింపుపై అత్యవసర విచారణను తిరస్కరించిన సుప్రీంకోర్టు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్ పొడిగించాలని కేజ్రీవాల్ చేసిన పిటిషన్ పై అత్యవసర విచారణను వెకేషన్ బెంచ్ తిరస్కరించింది.

Update: 2024-05-28 09:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్ పొడిగించాలని కేజ్రీవాల్ చేసిన పిటిషన్ పై అత్యవసర విచారణను వెకేషన్ బెంచ్ తిరస్కరించింది. ఈ కేసుపై ఇప్పటికే చర్చలు జరిగాయని, ప్రస్తుతం తీర్పు రిజర్వ్ లో ఉందని తెలిపింది. కేసు లిస్టింగ్ కు సంబంధించిన తదుపరి చర్యలపై సీజేఐ నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. కేజ్రీవాల్ తరఫు న్యాయవాది సింఘ్వీ వేసిన పిటిషన్ పై వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన బెంచ్ ఎదుట అత్యవసర విచారణ గురించి ఎందుకు ప్రస్తావించలేదని సింఘ్వీని ప్రశ్నించింది.

ఇక ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్ట్‌ అయిన తర్వాత తాను 7 కిలోల బరువు తగ్గినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కీటోన్‌ స్థాయిలు పెరిగాయని.. అందుకే తాను పీఈటీ-సీటీ స్కాన్‌ సహా పలు పరీక్షలు చేయించుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలోనే వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా తన మధ్యంతర బెయిల్‌ గడువును మరో 7 రోజులు పొడిగించాలని కోర్టుని కోరారు. కాగా, తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ ను మరో వారం రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ వేసిన ఆ పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయ్యారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్‌కు మే 10 నుంచి జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. జూన్ 2వ తేదీన కేజ్రీవాల్ లొంగిపోవాల్సి ఉంటుంది.


Similar News