కేసు పేపర్లలో కులం, మతం ప్రస్తావన వద్దు.. కోర్టులకు ‘సుప్రీం’ ఆదేశం

దిశ, నేషనల్ బ్యూరో : కోర్టు కేసులకు సంబంధించిన పేపర్లలో పిటిషన్‌దారుడి కులం, మతం వివరాలను ప్రస్తావించే పద్ధతిని ఆపేయాలని దేశంలోని న్యాయస్థానాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.

Update: 2024-01-29 13:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కోర్టు కేసులకు సంబంధించిన పేపర్లలో పిటిషన్‌దారుడి కులం, మతం వివరాలను ప్రస్తావించే పద్ధతిని ఆపేయాలని దేశంలోని న్యాయస్థానాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈమేరకు ఆదేశాలతో కూడిన ఉత్తర్వును అన్ని హైకోర్టులు, సబార్డినేట్ కోర్టులకు జారీ చేసింది. దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చెందిన న్యాయమూర్తులు హిమా కోహ్లీ , అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం ఈ ఆర్డర్స్ ఇచ్చింది. కోర్టు కేసులకు సంబంధించిన పిటిషన్ కాపీలలో కులం, మతం వివరాలను ప్రస్తావించడంలో అర్ధం లేదన్నారు. వివాహ వివాదానికి సంబంధించిన ఓ కేసు రాజస్థాన్‌లోని ఫ్యామిలీ కోర్టులో పెండింగ్‌లో ఉంది. తమ కేసుకు సంబంధించిన విచారణను పంజాబ్‌లోని ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ దంపతులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారిద్దరి పిటిషన్లలో కులం పేరు ఉండటాన్ని చూసి సుప్రీంకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తులు ఆశ్చర్యపోయారు. కులం వివరాలను ఎందుకు ప్రస్తావించారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులను ప్రశ్నించారు. ‘‘రాజస్థాన్‌లోని ఫ్యామిలీ కోర్టులో మేం దాఖలు చేసిన పిటిషన్‌లో కులం వివరాలను ప్రస్తావించాం. అదే సమాచారాన్ని యథాతథంగా సుప్రీంకోర్టు పిటిషన్‌లోనూ నమోదు చేశాం. సమాచారంలో తేడా ఉంటే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నుంచి అభ్యంతరం వ్యక్తమవుతుందేమో అనే ఆందోళనతో ఇలా చేయాల్సి వచ్చింది’’ అని న్యాయవాది వివరణ ఇచ్చారు. పిటిషనర్ల రిక్వెస్ట్ మేరకు వారి కేసు విచారణను పంజాబ్‌కు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఇకపై ఏ కోర్టులోనూ కేసుల పిటిషన్ కాపీలలో కులం, మతం ప్రస్తావన లేకుండా చూసుకోవాలని కోర్టులకు నిర్దేశించింది.

Tags:    

Similar News