ఎంతమందిని జైల్లో పెడతారు.. యూట్యూబర్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

సోషల్ మీడియాల్లో విమర్శలు చేస్తున్నారని అందరినీ జైలుకు పంపడం ఏంటని పేర్కొంది.

Update: 2024-04-08 14:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారత అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై 2021లో కించపరిచే ప్రసంగం చేశారనే ఆరోపణలతో అరెస్టయిన యూట్యూబర్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సమర్థించింది. ఈ క్రమంలోనే తమిళనాడు ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాల్లో విమర్శలు చేస్తున్నారని అందరినీ జైలుకు పంపడం ఏంటని పేర్కొంది. ఎన్నిక‌ల‌కు ముందు యూట్యూబర్‌లను జైల్లో పెడితే, అలా ఎంత మందిని అరెస్టు చేయాల్సి ఉంటుంద‌ని ప్ర‌శ్నించింది. అభిప్రాయాల‌ను, నిర‌స‌న‌ను వ్య‌క్తం చేసేందుకు మురుగ‌న్ త‌న స్వేచ్ఛ‌ను దుర్వినియోగం చేయ‌లేద‌ని కోర్టు అభిప్రాయపడింది. సీఎం స్టాలిన్‌పై యూట్యూబర్ దురై మురుగన్ 2021లో అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతనికి బెయిల్ కూడా మంజూరు అయింది. కానీ న్యాయస్థానం కల్పించిన స్వేచ్ఛను దుర్వినియోగం చేశాడనే కారణంతో 2022లో మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ అతని బెయిల్‌ను రద్దు చేసింది. ఈ వ్యవహారంలో మురుగన్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. రెగ్యులర్ బెయిల్ రద్దును సవాలు చేస్తూ మురుగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే గ‌త రెండున్నరేళ్లుగా మురుగ‌న్ బెయిల్‌పైనే ఉన్నార‌ని, అత‌ని బెయిల్‌ను ర‌ద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను తాము కొట్టిపారేస్తున్నామ‌ని సుప్రీంకోర్టు తెలిపింది. ఇదే సమయంలో తమిళనాడు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఇచ్చిన స్వేచ్ఛను మురుగన్ దుర్వినియోగం చేశాడనేందుకు ఎటువంటి సాక్ష్యాలు లేవు. కాబట్టి రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. 

Tags:    

Similar News