ఎన్నికల బరిలో ఖలిస్థానీ వేర్పాటువాది.. మద్దతుగా ర్యాలీ

ఖలిస్థానీ నాయకుడికి మద్దతుగా వందలాది మంది రోడ్లపైకి వచ్చారు. ఖలిస్థానీ నాయకుడు అమృత్ పాల్ సింగ్ కు మద్దతుగా యువకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Update: 2024-05-31 12:42 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఖలిస్థానీ నాయకుడికి మద్దతుగా వందలాది మంది రోడ్లపైకి వచ్చారు. ఖలిస్థానీ నాయకుడు అమృత్ పాల్ సింగ్ కు మద్దతుగా యువకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఖదూర్ సాహెబ్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అమృత్ పాల్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా యువకులు బైక్ ర్యాలీ చేపట్టారు. అమృత్ పాల్ డ్రగ్స్ ముప్పు నుంచి యువతకు సాయం చేస్తున్నారని ఆయన మద్దతుదారులు పేర్కొన్నారు. పంజాబ్ ప్రజల నుంచి తనకు అందుకే ఇంత మద్దతు లభిస్తుందని అన్నారు. అసలు సమస్య ఖలిస్థాన్ గురించి కాదని.. పంజాబ్ లో డ్రగ్స్ అమ్మకమే అని తెలిపారు. డ్రగ్స్ అమ్మకాలపై ఆప్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

అమృత్ పాల్ సింగ్ ని పంజాబ్ పోలీసులు గతేడాది ఏప్రిల్‌లో అరెస్టు చేశారు. ప్రస్తుతం జాతీయ భద్రతా చట్టం కింద అమృత్‌పాల్‌ అస్సాంలోని డిబ్రూగఢ్‌ జైల్లో ఉన్నారు. ఇకపోతే, పంజాబ్ లోని 13 లోక్ సభ స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది. ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆప్ లు పంజాబ్ లో విడవిడిగా పోటీ చేస్తున్నాయి. బీజేపీ, అకాళీదళ్ పార్టీలు కూడా ఈసారి వేర్వేరుగానే బరిలో దిగాయి. ఇకపోతే, 2019లో ఖదూర్ సాహిబ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత జస్బీర్ సింగ్ గిల్ గెలిచారు. ప్రస్తుతం ఆ స్థానంలో కాంగ్రెస్ తరఫున కుల్దీప్ సింగ్ జిరా, బీజేపీ నుంచి మంజిత్ సింగ్ మన్నా, ఆప్ నుంచి లల్జీత్ సింగ్ భుల్లర్, అకాలీదళ్ నుంచి విర్సా సింగ్ వాల్తోహా పోటీ చేస్తున్నారు.


Similar News