Srilanka Elections: ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు.. 65 శాతం పోలింగ్
శ్రీలంక పార్లమెంటు ఎన్నికలు(Srilanka Parliament Elections) గురువారం ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 4 గంటలకు(స్థానిక కాలమానం) పోలింగ్ ముగిసిన వెంటనే ఎన్నికల అధికారులు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు(Votes Counting) ప్రారంభించారు.
దిశ, నేషనల్ బ్యూరో: శ్రీలంక పార్లమెంటు ఎన్నికలు(Srilanka Parliament Elections) గురువారం ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 4 గంటలకు(స్థానిక కాలమానం) పోలింగ్ ముగిసిన వెంటనే ఎన్నికల అధికారులు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు(Votes Counting) ప్రారంభించారు. బ్యాలెట్ బాక్సులు కౌంటింగ్ కేంద్రాలు రాగానే ఆ ఓట్ల లెక్కింపు కూడా మొదలవుతుంది. ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. 2022 శ్రీలంక ఆర్థిక సంక్షోభం(Financial Crisis) తర్వాత జరుగుతున్న తొలి పార్లమెంటు ఎన్నికలు ఇవి. పార్లమెంటులోని మొత్తం 225 సీట్లల్లో 196 సీట్లకు నేరుగా పోలింగ్ జరిగింది. 8,821 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మిగిలిన 29 సీట్లను నేషనల్ లిస్ట్ ఆధారంగా డిసైడ్ చేస్తారు. దేశవ్యాప్తంగా సుమారు 13,314 కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ శాతం(Polling Percentage) సుమారు 65 శాతంగా నమోదైంది. గత అధ్యక్ష ఎన్నికల(79 శాతం)తో పోల్చితే పోలింగ్ శాతం తగ్గడం గమనార్హం.
పోటీకి దూరంగా సీనియర్లు:
రెండు నెలల క్రితమే శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు(Srilanka Presidential Elections) జరిగాయి. ఆ ఎన్నికల్లో శ్రీలంక సాంప్రదాయాలకు భిన్నంగా వామపక్ష భావాలున్న అనుర కుమార దిసనాయకే(Anura Kumara Dissanayake) అనూహ్యంగా గెలుపొందారు. శ్రీలంక అధ్యక్షుడి విజయానికి అవసరమైన 50 శాతం ఓట్లు ఆయనకు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లనూ లెక్కించారు. నేరుగా 50 శాతం ఓట్లు రాకుండా అధ్యక్షుడు కావడం శ్రీలంక చరిత్రలో ఇదే తొలిసారి. పార్లమెంటులోనూ ఆయన పార్టీ ఎన్‌పీపీకి స్వల్ప బలం ఉన్నది. అధ్యక్ష ఎన్నికల్లో ప్రకటించిన హామీలను ఆమోదించుకోవడానికి పార్లమెంటులో ఎంపీల బలం అనుర కుమార దిసనాయకేకు అత్యవసరం. 2019లో స్థాపించిన ఎన్‌పీపీకి పార్లమెంటులో కేవలం ముగ్గురు ఎంపీల బలమే ఉన్నది. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న మరుదినమే దిసనాయకే పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. ఈ ఎన్నికల్లో ఎన్‌పీపీకి మెజార్టీ సీట్లు దక్కే అవకాశమున్నదని అంచనాలు ఉన్నాయి. ఈ పార్లమెంటు ఎన్నికల్లో అధ్యక్ష, ప్రధాని, మంత్రులుగా బాధ్యతలు వహించిన సీనియర్ నాయకులు పోటీ చేయడం లేదు. రణిల్ విక్రమ సింఘే సహా రాజపక్స సోదరులైన మహింద, గొటబాయ, చామల్, బాసిల్‌లు పోటీకి దూరంగా ఉన్నారు. మరోవైపు దిసనాయకే పార్టీ ఎన్‌పీపీ అభ్యర్థుల్లో చాలా మంది తక్కువ అనుభవమున్నవారే ఉన్నారు.
మెజార్టీ మాదే: దిసనాయకే
బ్రిటీష్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందిన 1948 నుంచి శ్రీలంక పాలకవర్గంలో భాగంగా ఉన్న అనేక నాయకులు ఈ పార్లమెంటు ఎన్నికలకు దూరంగా నిలిచారు. అధ్యక్ష ఎన్నికల్లో ప్రజల అసహనం స్పష్టంగా కనిపించడం, అంతకుముందటి ఆర్థిక సంక్షోభం నెలలపాటు ప్రజాందోళనలతో దాదాపు అంతర్యుద్ధాన్ని తలపించింది. ఫలితంగా అప్పటి రాజపక్స కుటుంబానికి చెందిన అధ్యక్ష, ప్రధానమంత్రులు పదవులు వదిలిపెట్టారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచిపారిపోయారు. మధ్యంతర అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న రణిల్ విక్రమసింఘే అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) బెయిల్ ఔట్ ప్యాకేజీ సాధించడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పటికీ ఈ ప్యాకేజీ కొనసాగుతున్నది. ఫలితంగా పన్నుల, విద్యుత్ చార్జీలు అధికంగా ఉంటున్నాయి. శ్రీలంక పాలకవర్గమే ప్రజా ధనాన్ని దోచుకుని దేశాన్ని దివాళా తీసిందనే అభిప్రాయాలు అక్కడి ప్రజల్లో బలంగా ఉన్నది. సెప్టెంబర్ నెలలో నిర్వహించిన అధ్యక్ష ఎన్నికల్లో దిసనాయకే సంచలన హామీలు ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థను సమూలంగా ప్రక్షాళనగావిస్తానని, ప్రజా ధనాన్ని కొల్లగొట్టినవారిని విడిచిపెట్టబోనని, ఐఎంఎఫ్ ఒప్పందంలోనూ ప్రజానుకూల మార్పులు చేపడతానని హామీలు ఇచ్చారు. ఇలాంటి కీలక హామీలను ఆమోదించుకోవడానికి పార్లమెంటులో ఆ పార్టీకి బలం లేదు. ఫలితంగా ఆయన వెంటనే పార్లమెంటను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. ఈ ఎన్నికల్లో తన పార్టీ సులువుగా 150 సీట్లు సాధిస్తుందనే విశ్వాసాన్ని ప్రకటించారు.