దిశ, తెలంగాణ బ్యూరో: చంద్రుడు, అంగారకుడిపైకి మనుషులను తీసుకెళ్లే మిషన్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఎలన్ మస్క్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘స్పేస్ ఎక్స్’ రాకెట్ తొలి పరీక్షలోనే విఫలమైంది. అమెరికా టెక్సాస్ లోని బోకా చికా తీరంలో గల ప్రైవేట్ స్పేస్ ఎక్స్ స్పేస్ పోర్ట్ అయిన స్టార్ బేస్ నుంచి ప్రయోగించిన 400 అడుగుల పొడవైన ‘స్టార్ షిప్’ అనే ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన మూడు నిమిషాల్లోనే పేలిపోయింది. ఈ భారీ వ్యోమనౌకలోని బూస్టర్, స్పేస్ క్ట్రాఫ్ట్ అనే రెండు సెక్షన్లు మూడు నిమిషాల్లో విడిపోవాలి. కానీ అంతకు ముందే ఈ రాకెట్ పేలిపోయింది. 250 టన్నుల బరువును మోయగల ఈ రాకెట్ 100 మందిని అంతరిక్ష యానానికి తీసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంది.
మూడు రోజుల క్రితమే ప్రయోగించాల్సిన ఈ స్టార్ షిప్ ను సాంకేతిక కారణాలతో వాయిదా వేశారు. గురువారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు భూమి నుంచి చాలా ఎత్తుకు వెళ్లిన తర్వాత ఒక్కసారిగా పేలిపోయి గాలిలోనే ముక్కలైందని స్పేస్ ఎక్స్ కంపెనీ తెలిపింది. ప్రస్తుతానికి టెస్ట్ ఫ్లైట్ కోసం ప్రయోగించిన ఈ రాకెట్ సక్సెస్ అయితే భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడిపైకి మనుషులను తీసుకెళ్లేందుకు ఉపయోగించాలన్నది స్పేస్ ఎక్స్ ప్లాన్. ఈ స్పేస్ క్ట్రాఫ్ట్ భూమి చుట్టూ గంటన్నర పాటు ఒక పరిభ్రమణం సాగించి హవాయి సమీపంలో పడిపోయేలా తయారు చేశారు. అయితే.. ఈ ప్రయోగ వైఫల్యం నుంచి అనేక పాఠాలు నేర్చుకున్నామని, మరికొన్ని నెలల్లో మరో ప్రయోగం చేపడతామని ప్రకటించిన ఎలాన్ మస్క్ సిబ్బందిని అభినందిస్తూ ట్వీట్ చేశారు.