ఎమ్మెల్యే పదవికి రాజీనామా.. ఎంపీగా అఖిలేష్ యాదవ్
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బుధవారం రాష్ట్రంలోని కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బుధవారం రాష్ట్రంలోని కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు సంబంధించిన లేఖ శాసనసభ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రదీప్ దూబే కార్యాలయానికి అందింది. అఖిలేష్ 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్హాల్ అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యేగా గెలుపొందగా అప్పటి నుంచి రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ప్రతిపక్ష నేతగా మరొకరిని ఎంపిక చేయనున్నారు.
ఇదిలా ఉంటే పార్టీ సీనియర్ నేత అవధేష్ ప్రసాద్ కూడా ఫైజాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలవడంతో మిల్కీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ అధ్వర్యంలోని సమాజ్‌వాదీ పార్టీ 80 స్థానాలకు గానూ 37 స్థానాల్లో విజయం సాధించగా, భారతీయ జనతా పార్టీ 33 సీట్లు సాధించింది. కన్నౌజ్‌లో బీజేపీ అభ్యర్థి సుబ్రత్ పాఠక్‌పై 1,70,922 ఓట్ల తేడాతో అఖిలేష్ విజయం సాధించారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, రెండు స్థానాల నుంచి ప్రజాప్రతినిధిగా ఉన్నందున ఒకదాన్ని తప్పనిసరిగా వదిలేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తదుపరి ప్రతిపక్ష నేత ఎవరనే ప్రశ్నకు బదులిస్తూ.. పార్టీకి మేలు జరిగేలా, పార్టీ ఓట్ల శాతాన్ని పెంచే విధంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఢిల్లీలో చక్రం తిప్పాలని భావిస్తున్న అఖిలేష్ ఎంపీగా కొనసాగడానికి ఆసక్తి కలిగి ఉన్నారు.