బఠిండా కాల్పులు తోటి ఉద్యోగి పనే.. వ్యక్తిగత కక్ష్యలతో దారుణం
పంజాబ్‌లో కలకలం రేపిన బఠిండా మిలిటరీ స్టేషన్లో నలుగురిపై కాల్పుల ఘటనలో కీలక విషయాలు బయటకు వచ్చాయి.
చండీగఢ్: పంజాబ్‌లో కలకలం రేపిన బఠిండా మిలిటరీ స్టేషన్లో నలుగురిపై కాల్పుల ఘటనలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. వ్యక్తిగత కక్షలతో తోటి సైనికుడే నలుగురిని కాల్చాడని పంజాబ్ పోలీసులు సోమవారం ప్రాథమిక విచారణలో తెలిపారు. ఆర్మీ గన్నర్ ఇన్సాస్ రైఫిల్‌ను దొంగలించి, అతని సహచరులను కాల్చి చంపినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు తెలిపారు. క్రమపద్దతిలో జరిపిన విచారణలో జవాన్లను చంపేందుకు తుపాకి దొంగతనానికి గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో మరింతగా విచారించగా గన్నర్ దేశాయ్ మోహన్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలిందన్నారు.
వ్యక్తిగత కారణాలతో వారిని హతమార్చారని ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు. ఈ నెల 9న ఆయుధాన్ని దొంగలించగా, 12న ఉదయం నలుగురిపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత ఆయుధాన్ని మురుగు నీటి గుంటలో విసిరేసానని, నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా దానిని స్వాధీనం చేసుకున్నారు. అయితే అంతకుముందు మీడియా నివేదికలు పేర్కొన్నట్లు ఇందులో ఎలాంటి ఉగ్ర కోణం లేదని పేర్కొన్నారు.