కేజ్రీవాల్‌ను అవినితీపరుడన్నది రాహుల్ గాంధీయే :స్మృతి ఇరానీ
దిశ, నేషనల్ బ్యూరో : లిక్కర్ స్కాంలో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సంఘీభావం ప్రకటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విమర్శలు గుప్పించారు.
దిశ, నేషనల్ బ్యూరో : లిక్కర్ స్కాంలో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సంఘీభావం ప్రకటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ద్వంద వైఖరికి ఆయన వ్యాఖ్యలే నిదర్శనమని మండిపడ్డారు. కేజ్రీవాల్ అవినితీపరుడని తెలంగాణలో చెప్పిన రాహుల్ గాంధీ.. కేజ్రీవాల్ నిజాయితీపరుడని ఢిల్లీలో ప్రశంసిస్తుండటం విడ్డూరంగా ఉందని స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు.‘‘రాహుల్ గాంధీ ద్వంద వైఖరితో చేసిన వ్యాఖ్యల ఆధారాలను నేను ఇవ్వగలను. కేజ్రీవాల్‌తో పాటు బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ అవినీతిపరుడని 2023 జులై 2న తెలంగాణలో రాహుల్ చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి అన్ని విషయాలు దర్యాప్తు సంస్థలకు తెలుసని అప్పట్లో ఆయన తెలిపారు. అవినీతి సొమ్మును గోవా ఎన్నికలకు ఆప్ వినియోగించిందని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఆ సమయంలోనే ఆరోపించారు. వీరిలో నిజం చెబుతున్నది ఎవరు ?’’ అని స్మృతి ఇరానీ నిలదీశారు. ‘‘ఎవరు నిజమైన రాహుల్ గాంధీ? తెలంగాణలో మాట్లాడే రాహుల్ గాంధీ రియలా ? ఢిల్లీలో మాట్లాడే రాహుల్ గాంధీ రియలా?’’ అని ఆమె ప్రశ్నించారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి, అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఎంతటి అవినీతికి పాల్పడతారో అరవింద్ కేజ్రీవాల్‌ను చూస్తే తెలుస్తోందని స్మృతి ఇరానీ మండిపడ్డారు.