కల్పనా సోరెన్ వర్సెస్ సీతా సోరెన్.. జార్ఖండ్ సీఎం సీటు వ్యవహారం.. సోరెన్ ఫ్యామిలీలో చీలిక !

దిశ, నేషనల్ బ్యూరో : జార్ఖండ్‌లో ఈడీ రైడ్స్‌తో రాజకీయ కలకలం రేగుతోంది.

Update: 2024-01-31 12:32 GMT

దిశ, నేషనల్ బ్యూరో : జార్ఖండ్‌లో ఈడీ రైడ్స్‌తో రాజకీయ కలకలం రేగుతోంది. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత, సీఎం హేమంత్ సోరెన్‌ను ఒకవేళ ఈడీ అరెస్టు చేస్తే తదుపరి సీఎంగా ఆయన భార్య కల్పనా సోరెన్ అవుతారనే ప్రచారం జరుగుతోంది. ఈమేరకు ఇటీవల సీఎం హేమంత్ సోరెన్ చేసిన ప్రతిపాదనను ఆయన కుటుంబంలోని పలువురు వ్యతిరేకిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రత్యేకించి అందరి వేళ్లూ హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్ వైపు చూపిస్తున్నాయి. ఈమె హేమంత్ సోరెన్ అన్నయ్య దుర్గా సోరెన్ భార్య. గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా సీతా సోరెన్ ఎన్నికయ్యారు. 2009లో 39 ఏళ్ల దుర్గా సోరెన్ చనిపోయారు. 2022 ఆగస్టులో జార్ఖండ్‌లోని హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీత గళం విప్పారు. విమర్శలు గుప్పించారు. ఖనిజాల భూమిగా పేరొందిన జార్ఖండ్ రాష్ట్రంలో భూదోపిడీని అరికట్టడంలో హేమంత్ సోరెన్ ప్రభుత్వం విఫలమైందని ఆమె ఆనాడు వ్యాఖ్యానించారు. కట్ చేస్తే.. ఇప్పుడు హేమంత్ సోరెన్‌ను ఒకవేళ అరెస్ట్‌ చేస్తే ఆయన భార్య కల్పనా సోరెన్‌ను సీఎంగా చేయాలనే ప్రపోజల్ తెరపైకి వచ్చింది. దీనిపై చర్చించేందుకు జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలతో కూడిన కూటమిలోని ఎమ్మెల్యేలు మంగళవారం సమావేశమయ్యారు. కూటమిలోని 49 మంది ఎమ్మెల్యేల్లో 35 మంది హాజరయ్యారు. మిగతా 14 మంది ఎమ్మెల్యేలు కల్పనా సోరెన్‌కు వ్యతిరేకంగా సీతా సోరెన్‌కు మద్దతు ప్రకటించారనే అంచనాలు వెలువడుతున్నాయి. ఒకవేళ అదే జరిగి ఉంటే సోరెన్ కుటుంబంలో చీలిక ఏర్పడినట్టుగా భావించాల్సి ఉంటుంది. దీన్ని రానున్న రోజుల్లో ఏ పార్టీ అడ్వాంటేజ్‌గా తీసుకుంటుంది ? రాజకీయ పరిణామాలు ఏయే మలుపులు తిరుగుతాయి ? అనేది వేచిచూడాలి.

Tags:    

Similar News