రాజీనామాపై పునరాలోచనకు.. అంగీకరించిన శరద్ పవార్

వయసు మీద పడిన దృష్ట్యా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని మంగళవారం ఉదయం చేసిన ప్రకటనపై పునరాలోచన చేసేందుకు శరద్ పవార్ (83) అంగీకరించారు.

Update: 2023-05-02 14:19 GMT

న్యూఢిల్లీ: వయసు మీద పడిన దృష్ట్యా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని మంగళవారం ఉదయం చేసిన ప్రకటనపై పునరాలోచన చేసేందుకు శరద్ పవార్ (83) అంగీకరించారు. ఈ విషయాన్ని శరద్ పవార్ సోదరుడి కుమారుడు, ఎన్సీపీ సీనియర్ నేత అజిత్‌ పవార్ మంగళవారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. దీనిపై ఆలోచించుకోవడానికి రెండు, మూడు రోజుల టైంను ఆయన అడిగారని తెలిపారు. తాను, సుప్రియా సూలే (శరద్ పవార్ కుమార్తె) సహా పలువురు పార్టీ ముఖ్య నేతలు ఎన్సీపీ చీఫ్ తో భేటీ అయి అధ్యక్ష పదవిలో కొనసాగాలని విజ్ఞప్తి చేశామన్నారు.

"నేను నా నిర్ణయాన్ని తీసుకున్నాను. కానీ మీ అందరి కోసం ఆ నిర్ణయం పై పునరాలోచన చేస్తాను. కానీ, నాకు రెండు, మూడు రోజుల సమయం కావాలి. నా నిర్ణయంపై బాధతో నిరసన తెలుపుతున్న పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాలి. నా నిర్ణయం విషయం తెలుసుకొని కొందరు ఎన్సీపీ నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నారని తెలిసింది. వాళ్ళు రాజీనామాలు ఆపాలి" అని శరద్ పవార్ తమతో చెప్పారని అజిత్ పవార్ వెల్లడించారు. "మీరే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగండి. మీ కింద వర్కింగ్ ప్రెసిడెంట్‌ను నియమించండి" అని పార్టీ నేతలు శరద్ పవార్‌కు సూచించారని చెప్పారు.

Tags:    

Similar News