కేజ్రీవాల్‌కు వరుస సమన్లు..ఆప్ స్పందన ఇదే!

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) షాక్ ఇచ్చింది. రెండు వేర్వేరు కేసుల్లో కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. మొదట ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తొమ్మిదో సారి సమన్లు పంపిన ఈడీ 21న విచారణకు రావాలని ఆదేశించింది.

Update: 2024-03-17 07:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) షాక్ ఇచ్చింది. రెండు వేర్వేరు కేసుల్లో కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. మొదట ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తొమ్మిదో సారి సమన్లు పంపిన ఈడీ 21న విచారణకు రావాలని ఆదేశించింది. అలాగే ఢిల్లీ జల్ బోర్డులో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కూడా నోటీసులు పంపింది. ఈ కేసులో మార్చి 18(సోమవారం) ఇన్వెస్టిగేషన్‌కు రావాలని తెలిపింది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే 8 సమన్లను కేజ్రీవాల్ తిరస్కరించి విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో ఈడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా..కేజ్రీవాల్ శనివారం విచారణకు హాజరయ్యారు. వెంటనే రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో హాజరు నుంచి కేజ్రీవాల్‌కు మినహాయింపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈడీ మరోసారి సమన్లు జారీ చేయడం గమనార్హం.

ఇక, ఢిల్లీ జల్ బోర్డుకు సంబంధించిన కేసులో టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) 2022 జూలైలో కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపడుతోంది. విచారణలో భాగంగా ఫిబ్రవరిలో కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్, ఆప్ ఎంపీ ఎన్డీ గుప్తా, ఢిల్లీ జల్ బోర్డు మాజీ సభ్యుడు శలభ్ కుమార్, పంకజ్ మంగళ్‌లపై ఈడీ దాడులు చేసింది. దీంతో తాజాగా కేజ్రీవాల్‌ను విచారణకు పిలిచింది. అయితే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుసటి రోజే కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకే: ఢిల్లీ మంత్రి అతిశీ

కేజ్రీవాల్‌కు ఈడీ వరుస సమన్లు జారీ చేయడంపై ఆప్ నేత, ఢిల్లీ మంత్రి అతిశీ స్పందించారు. ఢిల్లీ జల్ బోర్డు కేసు గురించి ఎవరికీ తెలియదు. నకిలీ కేసులో కేజ్రీవాల్‌కు నోటీసులు పంపారు. కేజ్రీవాల్‌ను ఎలాగైనా అరెస్టు చేసి, లోక్‌సభ ఎన్నికల ప్రచారం నుంచి తప్పించడానికి బ్యాకప్ ప్లాన్‌గా అనిపిస్తోంది’ అని తెలిపారు. రాజకీయ ప్రత్యర్థులను అంతం చేసేందుకు బీజేపీ ఈడీ, సీబీఐలను ఉపయోగిస్తోందని ఆరోపించారు.

Tags:    

Similar News