Search Operation: కశ్మీర్‌లో ఉగ్ర కదలికలు..భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన బలగాలు!

ఉగ్రవాదుల అనుమానాస్పద కదలికలపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఆదివారం తెల్లవారుజామున జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్, రియాసి జిల్లాల్లో సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్‌లను ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు.

Update: 2024-07-28 12:55 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రవాదుల అనుమానాస్పద కదలికలపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఆదివారం తెల్లవారుజామున జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్, రియాసి జిల్లాల్లో సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్‌లను ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. పూంచ్ జిల్లాలోని సలోత్రి-మంగ్నార్ ఫార్వర్డ్ ఏరియా సమీపంలోని నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో భారీ జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ) సిబ్బందితో వేర్వేరు ప్రదేశాల్లో సోదాలు చేపట్టినట్టు వెల్లడించారు.

రియాసి జిల్లాలోని గ్రామ శివార్లలో ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను చూసినట్టు ఒక మహిళ చెప్పడంతో పోలీసులు భద్రతా దళాలు పోనీలోని దాదోయా ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. అవాంచిత కార్యకలాపాలు జరుగుతున్నట్టు గుర్తిస్తే వెంటనే తమకు తెలియజేయాలని నివాసితులను కోరారు. కాగా, జమ్మూ కశ్మీర్‌లో గత 50 రోజుల్లో 15 ఉగ్రదాడులు జరిగాయి. ఈ ఘటనల్లో ఇద్దరు అధికారులతో సహా 10 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో 58 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో సైన్యం నిరంతరం తనిఖీలు చేపడుతోంది. మరోవైపు కశ్మీర్‌లో మరిన్ని అదనపు బలగాలను మోహరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News