Supreme Court: ఓబీసీ సర్టిఫికెట్‌ల వ్యవహారంలో బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
కలకత్తా హైకోర్టు ఆదేశాలపై అత్యున్నత న్యాయస్థానం స్టే ఇవ్వలేదు.
దిశ, నేషనల్ బ్యూరో: 2010 తర్వాత పశ్చిమ బెంగాల్‌లో జారీ చేసిన అన్ని వెనుకబడిన కుల ధృవీకరణ పత్రాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం 77 కమ్యూనిటీలను గుర్తించేందుకు అనుసరించిన ప్రక్రియ గురించి తెలపాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, కలకత్తా హైకోర్టు ఆదేశాలపై అత్యున్నత న్యాయస్థానం స్టే ఇవ్వలేదు. ఈ ఉత్తర్వుపై స్టే ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ చేసిన దరఖాస్తుపై నోటీసు జారీ చేసింది. ఈలోగా, ఓబీసీలుగా గుర్తించేందుకు అనుసరించిన ప్రక్రియను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి తెలిపింది. వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని బెంగాల్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. 1993 చట్టం ప్రకారం ఓబీసీల కొత్త జాబితాను సిద్ధం చేయాలని పశ్చిమ బెంగాల్ వెనుకబడిన తరగతుల కమిషన్‌ను ఆదేశించింది. దానికి సంబంధించి 2010 తర్వాత పశ్చిమ బెంగాల్‌లో జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లను కలకత్తా హైకోర్టు మే 22న రద్దు చేసింది. 2010కి ముందు ఓబీసీ జాబితాలో ఉన్నవారు అలాగే ఉంటారు. అయితే 2010 తర్వాత జారీ అయిన ఓబీసీ నామినేషన్లు రద్దయ్యాయి. దానివల్ల దాదాపు 5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు కానున్నాయి.