ఎస్‌బీఐపై కోర్టు ధిక్కరణ పిటిషన్.. ఎందుకు ?
దిశ, నేషనల్ బ్యూరో : ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కోర్టు ధిక్కరణకు పాల్పడిందంటూ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
దిశ, నేషనల్ బ్యూరో : ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కోర్టు ధిక్కరణకు పాల్పడిందంటూ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల వివరాలను మార్చి 6లోగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాన్ని ఎస్‌బీఐ ధిక్కరించిందని వాదించింది. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించేందుకు జూన్ 30 వరకు గడువు కోరుతూ సుప్రీంకోర్టులో సోమవారం ఎస్‌బీఐ పిటిషన్ దాఖలు చేసింది. దీని విచారణ మార్చి 11న జరిగే అవకాశం ఉన్నందున.. దాంతోపాటే తాము దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పైనా విచారణ జరపాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనానికి ఏడీఆర్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ విజ్ఞప్తి చేశారు. ఈ వినతిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పిటిషన్‌ను మెయిల్ చేయాలని, అందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని గత నెలలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఇక ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించేందుకు ఎస్‌బీఐ గడువు కోరడాన్ని ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం బ్యాంకులను ఉపయోగించుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బుధవారం వెల్లడించింది. ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా ఎస్‌బీఐ ఎన్నికల బాండ్ల వివరాలను, ఎన్నికల కమిషన్‌కు వీలైనంత త్వరగా సమర్పించాలని డిమాండ్ చేసింది.