Sanjay Raut: మహారాష్ట్ర, జార్ఖండ్‌లకు షెడ్యూల్‌ ప్రకటనలో జాప్యంపై సంజయ్ రౌత్ విమర్శలు

మహారాష్ట్ర, జార్ఖండ్‌ల షెడ్యూల్ ప్రకటనలో జాప్యంపై ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Update: 2024-08-18 16:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు సంబంధించి శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్‌ల షెడ్యూల్ ప్రకటనలో జాప్యంపై ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతవారం భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) హర్యానా, కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 1 వరకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్‌ను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. జేఎంఎం ఎమ్మెల్యేలను వేటాడుతున్నారు. జార్ఖండ్‌లో ఎన్నికలు ప్రకటించి ఉంటే రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలయ్యేది. ఎమ్మెల్యేలకు ఇబ్బందులు ఉండేవి కావు. మహారాష్ట్రలో కూడా ముగ్గురికి(సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు) ఎన్నికలు జరిపేందుకు మరింత సమయం కోరుతున్నారు. అందుకే రాష్ట్రానికి షెడ్యూల్ ప్రకటించలేదని సంజయ్ రౌత్ అన్నారు. బీజేపీ ఓవైపు ఒకే దేశం-ఒకే ఎన్నికలు అంటారు, కానీ నాలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించలేరని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రె సీఎం అభ్యర్థిగా ప్రచారం జరగడంపై స్పందిస్తూ అది ప్రజాభిప్రాయం ఆధారంగా ఉంటుందని సంజయ్ రౌత్ చెప్పారు. సీఎం అభ్యర్థిగా ఎవరిని నామినేట్ చేసినా అతనికి మద్దతిస్తాం. అభ్యర్థిని చూసి ప్రజలు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ఇంకా ముందుగా ప్రకటించి ఉంటే తాము(ఇండియా కూటమి) మరో 25-30 సీట్లు గెలిచేదని ఆయన వెల్లడించారు. 

Tags:    

Similar News