సందేశ్ ఖాలీ కేసు..షేక్ షాజహాన్ ఛార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ
సందేశ్ ఖాలీలో ఈడీ బృందంపై దాడి జరిగిన కేసులో సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. టీఎంసీ మాజీ నేత షాజహాన్ షేక్ సహా మరో ఆరుగురిపై ఛార్జిషీటు దాఖలు చేశారు సీబీఐ అధికారులు.
దిశ, నేషనల్ బ్యూరో: సందేశ్ ఖాలీలో ఈడీ బృందంపై దాడి జరిగిన కేసులో సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. టీఎంసీ మాజీ నేత షాజహాన్ షేక్ సహా మరో ఆరుగురిపై ఛార్జిషీటు దాఖలు చేశారు సీబీఐ అధికారులు. ఈకేసులో తొలి ఛార్జిషీటుని ప్రత్యేక కోర్టుకు సమర్పించినట్లు వివరించారు. బెంగాల్ లో రేషన్ స్కాంలో అరెస్టయిన ఆ రాష్ట్ర మాజీ మంత్రి జ్యోతి ప్రియా మల్లిక్ తో షాజహాన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆ స్కాంకు సంబంధించి షాజహాన్ ఇంటిపై దాడి చేసేందుకు జనవరి 5న ఈడీ బృందం సందేశ్ ఖాలీ వెళ్లింది. షాజహాన్ నివాసానికి వెళ్లిన ఈడీ బృందంపై వెయ్యి మంది గుంపు దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించి మూడు కేసులను సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. షాజహాన్, అతని అనుచరులు సందేశ్ ఖాలీలో భూకబ్జాలు, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు స్థానిక మహిళలు ఆరోపించారు. స్థానిక మహిళలు షాజహాన్ కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. కాగా.. ఫిబ్రవరి 29న షాజహాన్ ను బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. మార్చి 6న అతడ్ని సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.