Sabarmati Train: తెల్లవారుజామున పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్
ఉత్తరప్రదేశ్‌లో శనివారం తెల్లవారుజామున సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో శనివారం తెల్లవారుజామున సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 కోచ్‌లు ట్రాక్ నుంచి కిందికి దిగిపోయాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సబర్మతి ఎక్స్‌ప్రెస్ యూపీలోని వారణాసి నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్ వరకు ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో రైలు ఝాన్సీకి వెళ్తుండగా కాన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో 2.35 గంటల ప్రాంతంలో ఒక బండరాయిని ఢీకొని పట్టాలు తప్పింది.
ప్రమాదం జరిగిన వెంటనే సమాచారాన్ని అందుకున్న పోలీసులు, రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక ట్రక్కులు, అంబులెన్స్ కూడా చేరుకున్నాయి. రైలును క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ఎవరూ గాయపడలేదని నిర్ధారించారు. ఇంజన్ ఢీకొన్న వస్తువు ఆనవాళ్లను అధికారులు భద్రపరిచారు. ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైళ్లను నిలిపివేశారు. కొన్నింటిని దారి మళ్లించినట్లు సమాచారం.
రైలులో ఉన్న ప్రయాణికులను క్షేమంగా బయటకు దింపి, ప్రత్యేక రైలు ద్వారా గమ్యస్థానానికి చేర్చారు. భారతీయ రైల్వే ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతోంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఇంజన్ తెల్లవారుజామున 2:35 గంటలకు కాన్పూర్ సమీపంలో ట్రాక్‌పై ఉంచిన వస్తువును ఢీకొట్టి పట్టాలు తప్పింది. వాటి ఆధారాలను భద్రపరిచాం. దీనిపై ఐబీ, యూపీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.