S Jaishankar: 1984 నాటి హైజాక్ అయిన విమానంలో తన తండ్రి ఉన్నారు: ఎస్ జైశంకర్
ఐఎఫ్ఎస్ అధికారిగా పనిచేసిన తొలిరోజుల్లో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిపారు.
దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక విషయాన్ని వెల్లడించారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో భారతీయ కమ్యూనిటీతో జరిగిన సంభాషణలో.. 1984లో హైజాక్ అయిన విమానంలో తన తండ్రి ఉన్నారని చెప్పారు. తాను ఇండియన్ ఫారిస్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారిగా పనిచేసిన తొలిరోజుల్లో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిపారు. నెట్‌ఫ్లిక్‌లో ప్రసారమవుతున్న 'ది కాందహార్ హైజాక్' సిరీస్ గురించి ప్రస్తావించిన ఆయన ఈ షాకింగ్ విషయాన్ని పంచుకున్నారు. 'నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న సిరీస్ చూడలేదు. కాబట్టి దాని గురించి మాట్లాడలేను. అయితే, 1984లో ఓ విమాన హైజాక్ జరిగింది. ఆ ఘటనను తానే ఓ అధికారిగా పర్యవేక్షించాల్సి వచ్చింది. ఆ సమయంలో తన తల్లికి ఫోన్ చేసి ఇంటికి రాలేనని చెప్పాను. అయితే, ఆ తర్వాత విమానంలో తన తండ్రి ఉన్నారనే విషయం తెలిసింది. అదృష్టవశాత్తు విమానంలోని 79 మందికీ ఏమీ కాలేదు. విచిత్రమేమిటంటే..ఓ వైపు హైజాక్ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తూనే, హైజాక్ గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించే కుటుంబసభ్యుల్లో వ్యక్తిగా కూడా ఉన్నానని' వివరించారు. కాగా, 1984లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఖాట్మండు-ఢిల్లీ ఐసీ421 విమానాన్ని ఏడుగురు ఉగ్రవాదులు హైజాక్ చేశారు. దాదాపు 40 గంటల పాటు ఆ విమానాన్ని పలు ఎయిర్‌పోర్టుల మధ్య తిప్పారు. అనేక పరిణామాల తర్వాత విమానంలోని వారంతా సురక్షితంగా బయటపడ్డారు.