‘ఆర్టికల్‌ 370’పై వాదిస్తే జాబ్ నుంచి సస్పెండ్ చేస్తారా?

జహూర్‌ అహ్మద్‌ భట్‌ కశ్మీర్‌లో ప్రభుత్వ లెక్చరర్. కానీ లా డిగ్రీ ఉండటంతో.. ఆర్టికల్‌ 370 రద్దుకు వ్యతిరేకంగా తాను వేసిన పిటిషన్‌పై తానే సుప్రీంకోర్టులో వాదన వినిపించారు.

Update: 2023-08-28 12:01 GMT

న్యూఢిల్లీ : జహూర్‌ అహ్మద్‌ భట్‌ కశ్మీర్‌లో ప్రభుత్వ లెక్చరర్. కానీ లా డిగ్రీ ఉండటంతో.. ఆర్టికల్‌ 370 రద్దుకు వ్యతిరేకంగా తాను వేసిన పిటిషన్‌పై తానే సుప్రీంకోర్టులో వాదన వినిపించారు. ఆగస్టు 24న ఆయన సర్వోన్నత న్యాయస్థానంలో వాదనలు వినిపించగా, ఆ మరుసటి రోజే (ఆగస్టు 25న) భట్‌ ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కశ్మీర్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా సోమవారం ఈ విషయాన్ని సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

‘భట్‌ రెండు రోజులు లీవ్ పెట్టి కోర్టుకు వచ్చారు. ఇక్కడ వాదనలు వినిపించారు. తిరిగి వెళ్లగానే సస్పెండ్‌ అయ్యారు’ అని కోర్టుకు తెలిపారు. దీంతో అహ్మద్‌ భట్‌‌ను విధుల నుంచి ఎందుకు పక్కనపెట్టారో తెలుసుకోవాలని అటార్నీ జనరల్‌ ఆర్‌. వెంకటరమణి, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.

‘సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన వ్యక్తిని సస్పెండ్‌ చేశారా? ఇలా జరగకూడదు. దీనిపై వెంటనే జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించండి’ అని నిర్దేశించింది. దీనిపై సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా స్పందిస్తూ.. లెక్చరర్‌ అహ్మద్‌ భట్‌ సస్పెన్షన్‌ వెనుక పలు కారణాలు ఉన్నాయన్నారు. ఆ లెక్చరర్ తరచూ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తుంటారని, ఆ వివరాలన్నీ కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు.


Similar News