డేరా చీఫ్ హత్య కేసులో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్!
దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్‌లో ఉన్న నానక్‌మట్టా సాహిబ్ గురుద్వారాలో డేరా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ గురువారం ఉదయం హత్యకు గురైన ఘటన కలకలం రేపింది.
దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్‌లో ఉన్న నానక్‌మట్టా సాహిబ్ గురుద్వారాలో డేరా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ గురువారం ఉదయం హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఓ కీలక విషయాన్ని గుర్తించారు. డేరా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ హత్యకు కుట్ర పన్నిన వారిలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హర్వాన్ష్ సింగ్ చుగ్ కూడా ఉన్నారని వెల్లడైంది. ఈయన ప్రస్తుతం నానక్‌మట్టా సాహిబ్ గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారని తేలింది. గురుద్వారా సభ్యుడు జస్వీర్ సింగ్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిలో మొత్తం ఐదుగురు నిందితుల పేర్లను చేర్చారు. డేరా ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను అడ్డుకుంటున్నారనే ఉద్దేశంతోనే బాబా తర్సేమ్ సింగ్‌ను హత్య చేశారని ఆ ఎఫ్ఐఆర్‌లో ప్రస్తావించారు. బాబాపై కాల్పులు జరపడానికి బైక్‌పై ఇద్దరు వ్యక్తులు రాగా, బైక్ రైడర్‌ను పంజాబ్‌కు చెందిన సర్వజీత్ సింగ్‌గా గుర్తించారు. అతడి వెనుక కూర్చొని కాల్పులు జరిపిన వ్యక్తిని యూపీకి చెందిన అమర్జీత్ సింగ్‌గా నిర్ధారించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఈవివరాలు వెల్లడయ్యాయి. మిగతా ఇద్దరు నిందితుల్లో తారై (సిక్కు) మహాసభ ఉపాధ్యక్షుడు ప్రీతంసింగ్ సంధు, గురుద్వారా హర్ గోవింద్ సింగ్ ప్రధాన జతేదార్ బాబా అనూప్ సింగ్ ఉన్నారు.