ప్రొఫెసర్ సాయిబాబా కేసును మళ్లీ విచారించండి: సుప్రీంకోర్టు
తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని ‘ఊపా’ చట్టం కింద కేసును ఎదుర్కొంటున్న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ గతంలో ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.
దిశ, తెలంగాణ బ్యూరో : తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని ‘ఊపా’ చట్టం కింద కేసును ఎదుర్కొంటున్న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ గతంలో ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆయన కేసును మెరిట్స్ ఆధారంగా మళ్ళీ విచారించారని, గతంలో తీర్పు ఇచ్చిన బెంచ్‌కు బదులుగా మరో బెంచ్‌కు బదిలీ చేయాలని జస్టిస్ ఎమ్మార్ షా ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో ఆయన చేసుకున్న అప్పీల్‌తో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్ళను కూడా నాలుగు నెలల్లో తేల్చేయాలని స్పష్టం చేసింది. గతంలో ముంబై హైకోర్టు ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చిందని, నాగ్‌పూర్ బెంచ్ వెలువరించిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయానికి వచ్చినట్లు అర్థమవుతున్నదని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం, ఎన్ఐఏ దాఖలు చేసిన పిటిషన్లను గత శనివారం సుదీర్ఘంగా విచారించిన జస్టిస్ ఎమ్మార్ షా, జస్టిస్ బేలా త్రివేదీలతో కూడిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. ఆ ప్రకారం బుధవారం దీనిపై జస్టిస్ ఎమ్మార్ షా విచారణ చేపట్టి, ప్రొఫెసర్ సాయిబాబాపై నమోదైన ‘ఊపా’ కేసుల లోతుల్లోకి తాము వెళ్లడం లేదని, కానీ ఆయనపై మోపిన అభియోగాలు చాలా తీవ్రమైనవని గుర్తుచేశారు. సమాజ ప్రయోజనాలు, భారతదేశ సార్వభౌమత్వం, సమగ్రతలను దృష్టిలో పెట్టుకుని దిగువ న్యాయస్థానాలు లోతుగా విచారణ జరిపాయని పేర్కొన్నారు. నాగ్‌పూర్ బెంచ్ వెలువరించిన తీర్పు ప్రభావంతో ముంబై హైకోర్టు తీర్పు ఆయనను నిర్దోషిగా ప్రకటించిందని, కేసు మెరిట్స్ లోతుల్లోకి వెళ్ళలేదని అభిప్రాయపడ్డారు.
మహారాష్ట్ర ప్రభుత్వం, ఎన్ఐఏ దాఖలు చేసిన పిటిషన్లను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ ఎమ్మార్ షా... ప్రొఫెసర్ సాయిబాబా కేసును లోతుగా మరోసారి విచారించారని, కొత్త బెంచ్ సమక్షంలో విచారణ జరగాలని సూచించారు. ట్రయల్ కోర్టు సీఆర్‌పీసీలోని సెక్షన్ 365 ప్రకారం దోషిగా ప్రకటించిన తర్వాత హైకోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించడం సమంజసమేనా అని గత శనివారం జరిగిన వాదనల సందర్భంగా జస్టిస్ ఎమ్మార్ షా, జస్టిస్ బేలా త్రివేదీ అభిప్రాయపడ్డారు. సాయిబాబా ఇప్పటికే సుప్రీంకోర్టులో దాఖలు చేసుకున్న స్పెషల్ లీవ్ పిటిషన్‌ను పెండింగ్‌లో పెట్టాల్సిందిగా ఆయన తరఫు న్యాయవాది బసంత్ చేసిన విజ్ఞప్తికి జస్టిస్ ఎమ్మార్ షా సానుకూలంగా స్పందించారు.