ఈ చట్టాలపై చర్చకు సిద్దం!.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు
కొత్త న్యాయ, నేర చట్టాలపై విపక్షాలు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నాయని, వీటితో బాధతులకు సత్వర న్యాయం జరుగుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కొత్త న్యాయ, నేర చట్టాలపై విపక్షాలు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నాయని, వీటితో బాధతులకు సత్వర న్యాయం జరుగుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై మీడియా సమావేశం నిర్వహించిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన 77 సంవత్సరాల తరువాత, మన నేర న్యాయ వ్యవస్థ పూర్తిగా స్వదేశీయంగా మారుతున్నందుకు ముందుగా దేశ ప్రజలను నేను అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ చట్టాలు భారతీయ తత్వంపై పనిచేస్తాయని తెలిపారు. 75 సంవత్సరాల తర్వాత, ఈ చట్టాల గురించి ఆలోచించడం జరిగిందని, ఈ చట్టాలు ఈ రోజు నుండి అమలులోకి వచ్చాయని అన్నారు. వలస రాజ్యాలు తీసుకొచ్చిన చట్టాలు రద్దచేయబడి, భారత పార్లమెంటులో చేసిన చట్టాలు ఆచరణలోకి వచ్చాయని, శిక్షకి బదులుగా ఇప్పుడు న్యాయం జరుగుతుందని, విచారణలో జాప్యానికి బదులుగా.. త్వరితగతిన విచారణ, సత్వర న్యాయం జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. గతంలో పోలీసుల హక్కులు మాత్రమే రక్షించబడ్డాయి, కానీ ఇప్పుడు బాధితుల, ఫిర్యాదుదారుల హక్కులు కూడా రక్షించబడతాయని తెలిపారు.
కొత్త దృక్కోణంతో, ఈ మూడు చట్టాలు అర్ధరాత్రి నుండి అమలులోకి వచ్చాయని, ఇప్పుడు, ఇండియన్ పీనల్ కోడ్ (IPC) బదులుగా భారతీయ న్యాయ సంహిత (BNS) ఉంటుంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC)కి బదులుగా, భారతీయ సాక్ష్యాధారాల చట్టం (BSA)కు బదులుగా భారతీయ నాగరిక్ సురక్షా సంహిత ఉంటుందని తెలిపారు. అలాగే మన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా సెక్షన్లు, అధ్యాయాల ప్రాధాన్యతను మేము నిర్ణయించామని. మహిళలు, పిల్లలపై నేరాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడిందని, ఇది చాలా ముందుగానే చేసి ఉంటే బాగుండేదని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. అలాగే 35 సెక్షన్లు మరియు 13 నిబంధనలతో మొత్తం అద్యాయం జోడించబడిందని, ఇప్పుడు గ్యాంగ్ రేప్‌కు 20 సంవత్సరాల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు, మైనర్‌పై అత్యాచారం చేస్తే మరణ శిక్ష, ఒకరి గుర్తింపును దాచిపెట్టడం లేదా తప్పుడు వాగ్దానాలు చేయడం ద్వారా లైంగిక దోపిడీకి యత్నిస్తే ప్రత్యేక నేరంగా పరిగణించబడుతుందని అన్నారు.
బాధితురాలు తన ఇంటి వద్ద మహిళా అధికారులు, ఆమె స్వంత కుటుంబ సభ్యుల సమక్షంలో వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ఒక నిబంధన చేయబడిందని, ఆన్‌లైన్ ఎఫ్‌ఐఆర్ కూడా చేయవచ్చని, ఈ విధంగా చాలా మంది మహిళలు ఇబ్బంది పడకుండా రక్షించబడతారని మేము నమ్ముతున్నామని అన్నారు. ఇక ఈ కొత్త చట్టాలపై ప్రతిపక్షంలో ఉన్న కొద్దిమంది మీడియా ముందు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ కొత్త చట్టాలపై లోక్ సభలో 34 మంది సభ్యుల మధ్య 9.29 గంటల చర్చలు జరిగిందని, అలాగే రాజ్యసభలో 40 మంది సభ్యుల మధ్య 6 గంటలకు పైగా చర్చలు జరిగిందని తెలియజేశారు. కానీ సభ్యులను బయటకు పంపిన తర్వాత (సస్పెండ్) బిల్లును తీసుకొచ్చారని విపక్షాలు తప్పుబడుతున్నాయన్నారు. అలాగే కొత్త చట్టాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, కొత్త న్యాయ చట్టాలపై అభిప్రాయాలు చెప్పాలని ఎంపీలకు లేఖ రాశానని తెలిపారు. బిల్లు ఇప్పటికే బిజినెస్ అడ్వైజరీ కమిటీ ముందు జాబితా చేయబడిందని, బహుశా ప్రతిపక్షాలు చర్చకు ముందే సభను బహిష్కరిస్తాయని, వారు చర్చలలో పాల్గొనడానికి ఇష్టపడకపోవచ్చని అమిత్ షా అన్నారు.