Rape convict Ram Rahim: హర్యానా ఎన్నికల వేళ పెరోల్ పై రానున్న డేరాబాబా..!

హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ మరో కీలక పరిణామం జరిగింది. డేరా సచ్చ సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తాత్కాలిక పెరోల్ కోసం అభ్యర్థించారు.

Update: 2024-09-29 10:33 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ మరో కీలక పరిణామం జరిగింది. ఇద్దరు మహిళా శిష్యురాళ్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ కేసులో డేరా సచ్చ సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తాత్కాలిక పెరోల్ కోసం అభ్యర్థించారు. 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరాబాబా బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ ఎన్నికలకు ముందే రామ్ రహీమ్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రామ్ రహీమ్ ఈ ఏడాది ఆగస్టు 13న 21 రోజుల పెరోల్‌పై రోహ్‌తక్ జిల్లాలోని సునారియా జైలు నుంచి ఆయన బయటకు వచ్చారు. గుర్మీత్ రామ్ రహీమ్‌కు హర్యానాలో లక్షలాదిమంది అనుచరులున్నారు.

హర్యానా అసెంబ్లీ ఎన్నికలు

అక్టోబర్ 5న జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఆయన పెరోల్‌కు అభ్యర్థించారు. ఇలాంటి పరిస్థితుల్లో హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామ్ రహీమ్ జైలు నుంచి బయటకు వస్తే, అది ఎన్నికలపై పెను ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే, హర్యానా ప్రభుత్వం డేరా బాబా పెరోల్ అభ్యర్థనను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి పరిశీలన కోసం పంపింది. అయితే, ఎన్నికల అధికారులు డేరాబాబా విడుదలకు అత్యవసరమైన, బలమైన కారణాలను అడిగారు. ఇటీవల, డేరా చీఫ్‌కు పదేపదే పెరోల్‌లు, ఫర్‌లోలు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (SGPC) దాఖలు చేసిన అభ్యర్థనను తిరస్కరించిన న్యాయస్థానం.. ఏ విధమైన "ఏకపక్షపాతం లేదా అభిమానం" లేకుండా సమర్థ అధికారి దీనిని పరిగణించాలని పేర్కొంది.


Similar News