Ramayana : క్రీస్తుపూర్వం నుంచే చైనాలో రామాయణం
దిశ, నేషనల్ బ్యూరో : క్రీస్తు పూర్వం నుంచే చైనీయులకు రామాయణం(Ramayana)తో, అందులోని పాత్రలతో, వాటి మహత్తర సందేశంతో అనుబంధం ఉందని చైనా(China) ప్రొఫెసర్ జియాంగ్ జింగ్‌క్యూ అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో : క్రీస్తు పూర్వం నుంచే చైనీయులకు రామాయణం(Ramayana)తో, అందులోని పాత్రలతో, వాటి మహత్తర సందేశంతో అనుబంధం ఉందని చైనా(China) ప్రొఫెసర్ జియాంగ్ జింగ్‌క్యూ అన్నారు. ఈయన చైనాలోని సింఘువా యూనివర్సిటీకి చెందిన ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ ఏరియా స్టడీస్’ విభాగం డీన్‌గా వ్యవహరిస్తున్నారు. ‘‘క్రీస్తు పూర్వం 206 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 220 వరకు చైనాను హాన్ వంశీయుల పాలించారు. ఆ కాలంలో కన్ఫ్యూషియనిజం అనే మతాన్ని చైనీయులు అనుసరించేవారు. అయితే బౌద్ధ మత ప్రచారం సైతం ముమ్మరంగానే జరిగేది. ఆనాడు ప్రచారం జరిగిన బౌద్ధ సాహిత్యం(Buddhist Texts)లోని కథల్లో దశరథ, హనుమ అనే పేర్లు కలిగిన పాత్రలు కూడా ఉండేవి’’ అని జియాంగ్ జింగ్‌క్యూ చెప్పారు.
చైనాలోని బీజింగ్‌లో ఉన్న భారత ఎంబసీ ‘రామాయణ - ఎ టైమ్‌లెస్ గైడ్’ పేరుతో నిర్వహించిన సింపోజియంలో ఆయన ప్రసంగించారు. ‘‘చైనాలో ప్రచారం చేసిన ఒక బౌద్ధ కథ ప్రకారం.. వానర రాజు హనుమంతుడు బుద్ధుడి బోధనలను అనుసరించేవాడు. చాలా చైనా సాహిత్య పుస్తకాల్లో ప్రస్తావించిన సన్ వూకాంగ్ పాత్ర హనుమంతుడిదే అయి ఉండొచ్చు. ఆ పాత్ర శైలి, అభిరుచి అన్నీ హనుమంతుడి తరహాలోనే ఉంటాయి’’ అని జియాంగ్ వివరించారు. రామాయణాన్ని సంస్కృతం నుంచి చైనీస్ భాషలోకి జి షియాన్‌లిన్ 1980లో అనువదించారని తెలిపారు. చైనాకు చెందిన టుబో సామ్రాజ్య పాలనా కాలంలో టిబెట్ ప్రజలకు తొలిసారిగా రామాయణ కావ్యం అందిందన్నారు. చైనాలోని భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్ కూడా ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.