Rajya Sabha: రాజ్యసభలో ఛైర్మన్ అవిశ్వాస నోటీసుపై రగడ.. గురువారానికి వాయిదా
రాజ్యసభ ఛైర్మన్(Rajya Sabha Chairman) జగదీప్ ధంఖర్(Jagdeep Dhankhar) పై అవిశ్వాస తీర్మానం గురించి పార్లమెంటులో(Parliament session) రగడ జరిగింది.
దిశ, నేషనల్ బ్యూరో: రాజ్యసభ ఛైర్మన్(Rajya Sabha Chairman) జగదీప్ ధంఖర్(Jagdeep Dhankhar) పై అవిశ్వాస తీర్మానం గురించి పార్లమెంటులో(Parliament session) రగడ జరిగింది. అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, రాజ్యసభ ప్రారంభం అయిన వెంటనే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. ఆ తర్వాత తిరిగి ప్రారంభమైనప్పటికీ ఎంపీలు శాంతిచకపోవడంతో రాజ్యసభ గురువారానికి వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు. కాగా.. రాజ్యసభ ప్రారంభమైన వెంటనే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు(Parliamentary Affairs Minister Kiren Rijiju).. జార్జ్ సోరోస్ అంశాన్ని లేవనెత్తారు. కాంగ్రెస్, జార్జ్ సోరోస్ మధ్య సంబంధం ఏంటో తేల్చాలని ఫైర్ అయ్యారు. దేశ ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో, ప్రతిపక్షాలు నిరసన చేపట్టాయి. జగదీప్ ధంఖర్‌ను తొలగించాలని కోరుతూ అవిశ్వాస తీర్మానం నోటీసుపై చర్చ జరపాలని విపక్షాలు నినాదాలు చేశాయి. దీంతో, రాజ్యసభ కార్యకలాపాలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి.
కేంద్రమంత్రిపై విమర్శలు
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుపై కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ మండిపడ్డారు. "పార్లమెంటరీ డిస్టర్బెన్స్ మినిస్టర్" అని ఆయన్ని అభివర్ణించారు. విమర్శలు చేస్తూ సభను నిర్వహించేందుకు అనుమతించట్లేదని ఆరోపించారు. "మంగళవారం సర్బానంద సోనోవాల్ జీ బిల్లును ప్రవేశపెడుతున్నప్పుడు కిరణ్ రిజిజు పార్లమెంటును సజావుగా జరగనివ్వలేదు" అని ఆయన అన్నారు. మరోవైపు, కాంగ్రెస్ ఎంపీ అఖిలేష్ ప్రసాద్ రాజ్యసభ ఛైర్మన్ పై విమర్శలు గుప్పించారు. "రాజ్యసభ ఛైర్మన్ ఇప్పుడు కూడా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. ఆయన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజుకు 15 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇచ్చారు. రాజ్యసభలో మా అభిప్రాయాన్ని చెప్పడానికి మాకు అవకాశం ఇవ్వలేదు. ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయి. ఉపరాష్ట్రపతిపై అవిశ్వాస తీర్మానం పెట్టే తీరతాం’’ అని అఖిలేష్ ప్రసాద్ సింగ్ అన్నారు.