160 కి.మీ హై-స్పీడ్‌లోనూ విజయవంతంగా పనిచేసిన 'కవచ్ వ్యవస్థ'
వందే భారత్ లాంటి సెమీ-హైస్పీడ్ రైళ్లు పెరుగుతున్న నేపథ్యంలో కవచ్ లాంటి వ్యవస్థ ప్రమాదాలను గణనీయంగా తగ్గించగలవని
దిశ, నేషనల్ బ్యూరో: రైళ్ల ప్రమాదాలను నివారించేందుకు అభివృద్ధి చేసిన కవచ్ వ్యవస్థ మరోసారి మెరుగైన ఫలితాలను అందించింది. తాజాగా నార్త్ సెంట్రల్ రైల్వే హై-స్పీడ్‌లో ప్రయాణించే సమయంలో 'కవర్ వ్యవస్థ' పనితీరుపై ట్రయల్ నిర్వహించగా, అది విజయవంతమైంది. హరియాణాలోని పాల్వాల్ నుంచి యూపీలోని మధుర స్టేషన్ల మధ్య సెమీ-హైస్పీడ్ రైల్లో కవచ్ వ్యవస్థ ఏర్పాటు చేసి పరీక్షించామని, గంటకు 160 కిలోమీటర్ల స్పీడ్ వద్ద ఇది సమర్థవంతంగా పనిచేసినట్టు ఆగ్రా రైల్వే డివిజన్‌కు చెందిన ప్రశస్తి శ్రీవాస్తవ చెప్పారు. 'ఈ పరీక్ష నిర్వహించే సమయంలో రెడ్ సిగ్నల్ పడినప్పుడు బ్రేకులు వేయవద్దని లోకో పైలట్‌కు సూచించాం. గంటకు 160 కిలోమీటర్ల స్పీడ్‌తో వస్తున్నప్పటికీ సిగ్నల్ పడిన వెంటనే 30 మీటర్ల ముందే కవచ్ ఆటోమెటిక్‌గా బ్రేకులు వేసి రైలును ఆపింది. ఈ పరీక్షలో శతాబ్ది, గతిమాన్ ఎక్స్‌ప్రెస్‌లను వినియోగించారు. త్వరలో ప్రయాణికులతో ఉన్న రైలులో దీన్ని పరీక్షించనున్నట్టు' ప్రశస్తి శ్రీవాస్తవ వివరించారు. వందే భారత్ లాంటి సెమీ-హైస్పీడ్ రైళ్లు పెరుగుతున్న నేపథ్యంలో కవచ్ లాంటి వ్యవస్థ ప్రమాదాలను గణనీయంగా తగ్గించగలవని అధికారులు పేర్కొన్నారు.