నాకు అమ్మానాన్నల తర్వాత రాహుల్ గాంధీయే: కన్నడ నటి
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కన్నడ నటి, లోక్‌సభ మాజీ సభ్యురాలు దివ్య స్పందన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో : కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కన్నడ నటి, లోక్‌సభ మాజీ సభ్యురాలు దివ్య స్పందన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని చేదు సంఘటనలు, రాహుల్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ‘నా తల్లిదండ్రులే నా ప్రాణం. నాన్న చనిపోయిన రెండు వారాలకే నేను పార్లమెంట్‌లో అడుగు పెట్టాల్సి వచ్చింది. కానీ పార్లమెంట్ కార్యకలాపాల గురించి నాకు ఏమీ తెలియదు.
అయినా ప్రతీదీ నేర్చుకున్నాను. నేను నా బాధను పని వైపు మళ్లించాను. అంతటి శక్తిని నాకు మాండ్యా ప్రజలే ఇచ్చారు. జీవితంలో నన్ను ఎక్కువ ప్రభావితం చేసిన వ్యక్తుల్లో అమ్మానాన్నల తర్వాత రాహుల్ గాంధీ ఉన్నారు. నాన్న మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. మరోవైపు ఎన్నికల్లో ఓడిపోయాను. అలాంటి కష్ట సమయంలో రాహుల్ గాంధీ నాకు అండగా నిలబడి సహాయం చేశారు. మానసికంగా ధైర్యాన్ని నూరిపోసి సపోర్ట్ చేశారు’ అని చెప్పుకొచ్చారు.
కాగా 2012లో రాజకీయాల్లో ప్రవేశించిన ఆమె 2013లో మాండ్య లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికల్లో గెలిచారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షురాలిగా పని చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత ఆ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆమె ఇటీవలే ఉత్తరకాండతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు.