నా పేరు సావర్కర్ కాదు.. నేను సారీ చెప్పను: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పీఎం మోడీ, బీజేపీపై నిప్పులు చెరిగారు.
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పీఎం మోడీ, బీజేపీపై నిప్పులు చెరిగారు. మోడీ ఇంటిపేరు వ్యవహారంలో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేలుస్తూ రెండేళ్ల జైలు శిక్ష వేసింది. ఈ నేపథ్యంలోనే నిన్న వయనాడ్ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీని లోక్ సభ అనర్హుడిగా ప్రకటించింది. ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీ ఇవాళ ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. పార్లమెంట్ లో తను ప్రసంగించేటప్పుడు మోడీ కళ్లల్లో భయాన్ని చూశానని అన్నారు. పార్లమెంట్ లో తనను ప్రసంగించకుండా అడ్డుకోవడానికే మోడీ తనపై అనర్హత వేటు వేయించారని మండిపడ్డారు.
లండన్ లో తాను చేసిన వ్యాఖ్యలకు బీజేపీ క్షమాపణలు కోరిందని, అయితే క్షమాపణలు చెప్పడానికి తాను సావర్కర్ ను కాదని, గాంధీని అని రాహుల్ స్పష్టం చేశారు. దేశ వ్యవహారాల్లో విదేశీ శక్తుల జోక్యాన్ని తాను కోరుతున్నట్లు, విదేశీ విద్రోహ శక్తులకు సాయం చేస్తున్నట్లు బీజేపీ తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని అన్నారు. ‘‘నేను నిజం కోసమే పోరాడుతా. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఎల్లవేలలా కృషి చేస్తా. నాపై జీవితాంతం అనర్హత వేటు వేసినా.. జీవిత ఖైదు చేసినా నా పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తునే ఉంటా’’ అని రాహుల్ స్పష్టం చేశారు.