ప్రధానిగా నా ఛాయిస్ అతడే- కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆసక్తికర కామెంట్లు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తే.. ప్రధానిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించాలని అభిప్రాయపడ్డారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆసక్తికర కామెంట్లు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తే.. ప్రధానిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించాలని అభిప్రాయపడ్డారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖర్గే మాట్లాడుతూ.. ప్రధానిగా తన ఛాయిస్ రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు. దేశంలోని యువతకు, అన్నివర్గాల ప్రజలకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. ఇదిలా ఉండగా, తాను కూడా ప్రధాని అభ్యర్థిగా ఉండవచ్చనే ఊహాగానాలను ఖర్గే కొట్టిపారేశారు. తన పేరుని తానే ఎలా ప్రతిపాదించుకోగలనని ప్రశ్నించారు. కూటమిలోని ఇతర పార్టీలు తనను ప్రధాని అభ్యర్థిగా ఊహించుకున్నారేమో అని స్పష్టం చేశారు. అయితే, ప్రధాని అభ్యర్థి ఎవరనేది ఎన్నికల తర్వాతే నిర్ణయిస్తామన్నారు. ప్రధాని అభ్యర్థి ఎవరనేది తమ పార్టీ నేతలందరూ కూర్చొని నిర్ణయిస్తామన్నారు.
ప్రియాంక గాంధీ ఎన్నికల అరంగేట్రంపై ఖర్గే స్పందించారు. లోక్ సభ ఎన్నికల బరిలో ప్రియాంక పోటీ చేయాలని తాను కోరుకున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మునిగిపోయాడని గుర్తుచేశారు. రాహుల్ తరఫున ప్రచారానికి ఎవరైనా అవసరమని.. అందుకే ప్రియాంక ఈసారి ఎన్నికల్లో పోటీ చేయలేదన్నారు. కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్ బరేలీ నుంచి ప్రియాంకను పోటీచేయాల్సిందిగా గతంలో తాను కోరినట్లు తెలిపారు.
మరోవైపు, ఇండియా కూటమి నేతలు శనివారం సమావేశం కానున్నారు. కూటమి సభ్యులతో సమన్వయంపై దృష్టి సారించేందుకు భేటీ కానున్నట్లు ఖర్గే తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే తనను చీఫ్ పదవి నుంచి తప్పించనున్నట్లు వస్తున్న వార్తలు హాస్యాస్పదం అని ఖర్గే అన్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమన్నారు.