వారికి సాయం చేయడానికే ప్రధాని మోడీని దేవుడు పంపాడు: రాహుల్ గాంధీ సెటైర్లు
ప్రతి ఒక్కరికీ జీవసంబంధం ఉంటుంది. కానీ ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే బయలాజికల్‌గా పుట్టలేదు.
దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు చివరిదశకు చేరుకుంటున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోడీపై సెటైర్లతో విమర్శల తీవ్రత పెంచారు. ఇటీవల ప్రధాని మోడీ తనను దేవుడు పంపాడని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఎద్దేవా చేస్తూ.. గౌతమ్ అదానీ, ముఖేశ్ అంబానీ లాంటి పారిశ్రామికవేత్తల కోసమే నరేంద్ర మోడీని పరమాత్ముడు పంపాడని, పేదల కోసం కాదని విమర్శించారు. మంగళవారం యూపీలోని డియోరియాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. ప్రతి ఒక్కరికీ జీవసంబంధం ఉంటుంది. కానీ ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే బయలాజికల్‌గా పుట్టలేదు. ఆయనను అంబానీ, అదానీలకు సహాయం చేసేందుకు పరమాత్మ పంపాడు. పేదలు, రైతులు, శ్రామికుల కోసం కాదని రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. దేవుడు మోడీని పంపి ఉంటే, ఆయన పేదలకు, రైతులకు సాయం చేసేవారు. అలాంటపుడు ఆయన ఎలాంటి దేవుడు? అని ప్రశ్నించారు. కాగా, ఇటీవల ప్రధాని మోడీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను బయోలాజికల్‌గా జన్మించినవాడిని కాదని, దేవుడు పంపితేనే వచ్చానని చెప్పారు. మా అమ్మ బతికున్నంత వరకు తాను బయోలాజికల్‌గా పుట్టినట్టు భావించాను. ఆమె చనిపోయిన తర్వాత దీనిపై తనకు స్పష్టత వచ్చిందని మోడీ పేర్కొన్నారు.